బిజెపి డైలమా, టిఆర్ఎస్‌లో అసంతృప్తి, టిడిపి రేవంత్ షాక్!
హైదరాబాద్: తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలలో అయోమయం నెలకొన్నట్లుగానే కనిపిస్తోంది. టిఆర్ఎస్‌లో అసంతృప్తి, కాంగ్రెస్, టిడిపిలకు ఆపరేషన్ ఆకర్ష్ బాధ, టిడిపిపై ఓటుకు నోటు ఎఫెక్ట్, తెలంగాణ ఇచ్చినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడం, ఇప్పటికీ ఆ పార్టీ కుదురుకోలేదు.
బిజెపి పరిస్థితి కూడా అలాగే ఉంది. టిడిపితో పొత్తు విషయమై ఇంకా గందరగోళం నెలకొంది. అలాగే, టిఆర్ఎస్‌తో పొత్తు పైన ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇలా తెలంగాణలో రాజకీయ పార్టీలు అయోమయంలో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయని అంటున్నారు.
మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొందరిలో అసంతృప్తి ప్రారంభమవుతోంది. చాలా రోజుల క్రితమే అసంతృప్తి బయటపడుతుందని భావించినప్పటికీ... ఓటుకు నోటు కేసు దానిని అడ్డుకున్నదనే వాదనలు ఉన్నాయి.
మొదటి నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొన్న మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కకలేదు. పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ పదవితో సరిపెట్టుకున్నారు. కోర్టు తీర్పుతో అది కూడా పోవడంతో ఇటీవల తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని చెబుతున్నారు.
కొందరు తనకు మంత్రి పదవి రాకుండా చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో లభించినంత గౌరవం కూడా ఇప్పుడు ఇవ్వడం లేదని ఆయన బహిరంగ విమర్శలు చేయడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి.

రాష్ట్ర విభజన, ఎన్నికల్లో ఓటమి అనంతరం టిడిపి మొదట ఉత్సాహంగానే కనిపించింది. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, చివరకు 10 మంది పార్టీలో మిగిలారు. ఓటుకు నోటు తర్వాత తెలంగాణ టిడిపి నాయకుల్లో ఒకింత స్తబ్దత నెలకొందని చెప్పవచ్చు.
ఓటుకు నోటు తర్వాత.. మిగతా నేతలు మాట్లాడుతున్నప్పటికీ, అంతా రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. దీంతో, కొందరు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపి పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నాయకులకే అంతు చిక్కడం లేదు.
తెలంగాణలో టిడిపి పట్ల తీవ్రంగా వ్యతిరేకత ఉండగా, ఆ పార్టీతో కలిసి ఉండడం వల్ల పార్టీ ఎదగడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయం బిజెపి నాయకుల్లో ఉంది.
నాగం జనార్దన్ రెడ్డి లాంటి కొందరు పార్టీలో చేరినా, పార్టీకే తెలంగాణలో భవిష్యత్తు లేనప్పుడు మాకేముంటుందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టిడిపితో కలిసి ఉండటం బిజెపికి నష్టం చేకూరుస్తుందనే వాదన కమలం పార్టీలోనే ఉంది.
అయితే, అధిష్టానం మాటను జవదాటే పరిస్థితి లేదు. దీంతో, తెలంగాణ బిజెపి నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం నాడు తెలంగాణ అభివృద్ధి కోసం... తెలంగాణ బచావో వేదికను ప్రకటించారు.
కాంగ్రెస్‌లో ఎవరికి వారే అన్నట్టుగా ఉందంటున్నారు. పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నాయకుడు ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లాకు చెందిన వారు. మరోవైపు, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టటంలో ఎవరికి వారే అన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
రాష్ట్రంలో వరంగల్ పార్లమెంటు, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలను బట్టి రాజకీయాల్లో ప్రభావం ఉంటుందని పార్టీల నాయకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications