నరేంద్ర వార్తలతో తెలంగాణ వేడి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేతల్లో ఒకరైన ఎ. నరేంద్ర రాజీనామా వార్తతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణపై మే నెలలో ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని సబ్‌ కమిటీ నివేదికను సమర్థిస్తుందనే ఒక గట్టి నమ్మకం వమ్ము కావడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నోరు విప్పడం లేదు. దానికితోడు ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ తూతూ మంత్రంగా సాగుతున్నదనే భావన బలపడుతూ వస్తున్నది. ఈ తరుణంలో తెరాస నాయకులు ఇంకా మాటల మాయాజాలంతో యుపిఎలో, కేంద్ర మంత్రి పదవుల్లో కొనసాగడం చేజేతులా పరువు కోల్పోవడానికి సిద్ధపడ్డట్లే అవుతుంది.

నిజానికి, తెరాసను తీవ్రమైన ఇరకాటంలో పెట్టింది బిజెపి ప్రకటన. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇస్తామని బిజెపి ప్రకటించడంతో తెలంగాణ అంశాన్ని ఏదో రూపంలో ముందుకు తీసుకుపోవాల్సిన అనివార్యతలో తెరాస నాయకులు పడ్డారు. దీనివల్లనే చంద్రశేఖర్‌రావు నరేంద్రను, మిగతా నాయకులను వెంట బెట్టుకుని కాంగ్రెస్‌ సీనియర నాయకుల చుట్టూ తిరిగారు. ఫలితంగా ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ సమావేశం ఏర్పాటుకు తేదీ ఖరారైంది. ఈ నెల 18వ తేదీన సమావేశమైన ప్రణబ్‌ కమిటీ తెలంగాణపై ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశించారు. అయితే అది ఎటూ తేల్చకపోగా, ఇప్పట్లో తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదనే పద్ధతిలో మాట్లాడింది.

ఈ స్థితిలో నరేంద్ర రాజీనామాకు నిర్ణయం తీసుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణపై కాంగ్రెస్‌ నాయకత్వం ఒక వైపు నాన్చుడు ధోరణి అవలంబిస్తుంటే, మరో వైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తెరాస శాసనసభ్యుల్లో అసమ్మతిని రెచ్చగొట్టి చంద్రశేఖరరావుపైకి ఉసిగొల్పారు. అసమ్మతి శాసనసభ్యుల అసమ్మతిని రాజకీయ వ్యూహంతో ఎదుర్కునే ప్రయత్నాలు చంద్రశేఖరరావు చేస్తూనే వున్నారు. తెలంగాణపై ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకులు తాత్సారం చేస్తున్న కొద్దీ చంద్రశేఖరరావు క్యాడర్‌పరంగానే కాకుండా నైతికంగా కూడా బలహీనపడడం ఖాయం. ఇదే పద్ధతిలో కొనసాగితే తనకు కూడా అదే గతి పడుతుందని నరేంద్ర అనుకుని వుంటారు. అందుకే ముందస్తుగా ఒక నిర్ణయానికి రావడమే రాజకీయంగా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవచ్చునని ఆయన అనుకుని వుంటారు.

నరేంద్ర మొదటి నుంచీ బిజెపి మనిషి. అయితే సూచనల మేరకు ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. తెలంగాణ ఏర్పాటుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నా కూడా కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నదని ఆయన భావన కావచ్చు. నరేంద్ర రాజీనామా నిర్ణయం వల్ల చంద్రశేఖరరావుపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఆయన సోనియా చేతనో లేదా కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం ప్రతినిధులతో తెలంగాణపై ఒక అనుకూల ప్రకటన చేయించాల్సి వుంటుంది. లేనిపక్షంలో ఆయన కూడా రాజీనామాకు సిద్ధపడాల్సి వుంటుంది. రాజీనామా చేయడం వల్ల తెలంగాణ ఏర్పాటు మరింత జాప్యం అవుతుందనేది చంద్రశేఖర రావు ఆలోచనగా ఆయన మాటలను బట్టి అర్థమవుతూ వస్తున్నది. అయితే ఇలా పార్టీని, తమ రాజకీయ వ్యక్తిత్వాలను బలహీనపరుచుకునే రాజకీయాలను కాంగ్రెస్‌ను నమ్ముకుని ఎంత కాలం కొనసాగిస్తారనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు చంద్రశేఖరరావు సమాధానం వెతుక్కోక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+