వామ్మో ఎంతకు తెగించార్రా.. ఫేక్ డెత్ సర్టిఫికెట్ ను సృష్టించి.. ఏకంగా..
నల్గొండలోని వైద్యారోగ్య శాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి కారుణ్య ఉద్యోగాలు పొందిన కేసులో అసలు సూత్రధారులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన బంధువులు, మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలాగే సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఏం జరిగిందంటే..?
శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చామకూరి వెంకటేశ్వర్లు హెల్త్ అసిస్టెంట్ గా పనిచేశారు. అయితే గతేడాది మే 31 న పదవీ విరమణ పొందిన ఆయన ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 17న మరణించారు. అయితే ఆయన పదవీ విరమణ పొందిన విషయాన్ని దాచిపెట్టి.. సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ ను దాంతోపాటు ఇతర నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. ఈ మేరకు కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు ప్లాన్ వేశారు.

ఇక ఈ వ్యవహారంలో దాదాపు రూ.13 లక్షల ఆర్థిక ఒప్పందం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు, మున్సిపల్, వైద్యారోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇక మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మరోవైపు నల్గోండ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ కారుణ్య నియామక స్కామ్ లో ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications
