ఇరాన్‌పై మరో యుద్ధం ఉండదా? ట్రంప్ కామెంట్లతో మారిన సీన్!
ఇరాన్ దేశంతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో స్పష్టమైన మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా ముందుకు సాగితే ఆ దేశంపై అమెరికా మళ్లీ సైనిక చర్యలకు ఆదేశించాల్సన అవసరం చాలా తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను సమీకరించకుండా నిరోధించాలనే తమ స్పష్టమైన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. ఇటీవల ముగిసిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చర్చలు సఫలమైతే దాడుల అవకాశం తక్కువ
సీఎన్ఎన్ ఫోన్ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో మళ్లీ మిలిటరీ చర్యలకు దిగాల్సిన పరిస్థితి ఉందా అని ప్రశ్నించగా.. "ఇరాన్ ఓ బలమైన, దృఢమైన ఒప్పందానికి అంగీకరిస్తుందా లేదా అనేదానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చర్చలు పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో మళ్లీ యుద్ధం చేయాల్సిన అవసరం చాలా తక్కువ" అని ట్రంప్ స్పష్టం చేశారు. పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ.. మిలిటరీ చర్యల ప్రత్యామ్నాయాన్ని అమెరికా పూర్తిగా తోసిపుచ్చలేదు. అణు కార్యక్రమాలు, న్యూక్లియర్ డెవలప్మెంట్ నియంత్రణతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఇరు దేశాల మధ్య ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.

సైన్యం సిద్ధం.. ట్రంప్ హెచ్చరిక
ఓ వైపు దౌత్య చర్చల గురించి మాట్లాడుతూనే.. మరోవైపు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందనే హెచ్చరికను కూడా డొనాల్డ్ ట్రంప్ జారీ చేశారు. ఇరాన్‌లోని దాదాపు 38 వంతెనలు సహా ప్రధాన మౌలిక సదుపాయాలను తమ సైన్యం లక్ష్యంగా చేసుకుందని, కేవలం ఓ గంట వ్యవధిలోనే వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యం ఉందన్నారు. అయితే ఆ దేశ నిర్మాణ వ్యవస్థను నాశనం చేయడం తమ ఉద్దేశం కాదని, వాటిని మళ్లీ నిర్మించడానికి కనీసం పదేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక రంగానికి ఇప్పటికే అమెరికా దళాలు తీవ్ర నష్టం కలిగించాయని ట్రంప్ పేర్కొన్నారు.
మధ్యంతర ఎన్నికల పరాజయం.. మారుతున్న రాజకీయ సమీకరణాలు
నవంబర్ 3న జరిగిన ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించి పార్లమెంట్‌లో మెజారిటీ కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల నియంత్రణ కోల్పోవడం డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఇది అమెరికా చరిత్రను వెనక్కి తీసుకెళ్లే చర్య అని ట్రంప్ ఆరోపించారు. ఈ ఫలితాల ప్రభావంతో ఒకే రోజు స్టాక్ మార్కెట్ 3 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు మెజారిటీ రావడంతో ఇరాన్ యుద్ధ విధానం, ప్రభుత్వ వ్యయం, విదేశీ విధానాలపై డొనాల్డ్ ట్రంప్ పై రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంటరీ కమిటీలు ఇకపై ప్రభుత్వ నిర్ణయాలను, విదేశాంగ విధానాలను కఠినంగా సమీక్షించనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌తో శాంతియుత ఒప్పందానికే మొగ్గు చూపుతారా లేదా సైనిక చర్యలను ఎంచుకుంటారా అనేది ఇరు దేశాల చర్చల పురోగతిపైనే ఆధారపడి ఉంది.














Click it and Unblock the Notifications
