సీనియర్లకు పరీక్ష
తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం ఇప్పుడిప్పుడే వైఖరిని స్పష్టం చేయడానికి సిద్దంగా లేకపోవడంతో తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు వచ్చేనెల 10వ తేదీన తలపెట్టిన బహిరంగ సభ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్లు నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ సభను తలపెట్టారు. దీనికి ఏర్పాట్లన్నీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చూస్తున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడుతున్న ఆయన ఆ బాధ్యతను మోయడానికి సిద్ధపడ్డారు. ఈ సభకు జి. వెంకటస్వామితో పాటు పలువురు సీనియర్లు హాజరు కానున్నారు.
వచ్చే నెల 14వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షురాలు, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఆమె శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. దీనికి తెలంగాణ సీనియర్లు సభను పెట్టడం అధికార పక్షానికి కష్టంగానే ఉంది. అయితే కాంగ్రెస్ జూనియర్లు మాత్రం సీనియర్లపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నల్లగొండ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి సభను విరమించుకోవాలని సీనియర్లకు విజ్ఞప్తి చేశారు. 14వ తేదీన సోనియా రాక సందర్భంగా ర్యాలీ ఉండగా దానికి ముందు భువనగిరి సభ పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుందని, 2009 ఎన్నికల లోపు పార్టీ అధిష్ఠానవర్గం తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తుందని, అందువల్ల సీనియర్లు తమ కార్యకలాపాలను మానుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కారని, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలే హాజరవుతారని ఆయన చెప్పారు.
సీనియర్లపై మంత్రి టి. జీవన్ రెడ్డి మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆశీర్వాద యాత్ర లాగే సీనియర్ల సభ ఫ్లాపవుతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస భూస్థాపితమవుతుందని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వల్లనే తెరాస పరువు దక్కిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో భువనగిరి సభ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పరీక్ష లాంటిదే. ఈ సభ విఫలమైతే ఇంత వరకు మాట్లాడుతున్న మాటలను వారు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.












Click it and Unblock the Notifications