హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు చేతుల్లో ఏమీ లేదా?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
బలమైన రాజకీయ పార్టీగా ప్రజారాజ్యాన్ని చిరంజీవి రూపుదిద్దలేరనే ఉద్దేశంతోనే టి.దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిపై నమ్మకం పోవడం వల్లనే దేవేందర్ గౌడ్ తో పాటు పెద్దిరెడ్ది, ఇతర నాయకులు కూడా సొంత గూడు తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో వైఫల్యం వారిని పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, ఎన్నికల తర్వాత ఫలితాలపై సమీక్షలో నాయకత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని దేవేందర్ గౌడ్ భావిస్తున్నారు.

కాంగ్రెసుకు ప్రజారాజ్యం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం కూడా ఆయనలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు చిరంజీవి అంగీకరించడం లేదని ఆయన అనుకుంటున్నారు. కాంగ్రెసుకు ధీటైన శక్తిగా ఎదగడానికి తగిన ప్రణాళిక లేకపోవడమే కాకుండా ఆ మేరకే ఎదిగాలనే ఉద్దేశం కూడా చిరంజీవిలో లేదని అంటున్నారు. దీంతో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటనే అభిప్రాయం బలపడింది. దీంతో దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సమాయత్తమైనట్లు చెబుతున్నారు.

తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను దేవేందర్ గౌడ్ ఖండించలేదు. దీన్ని బట్టి ఆయన తెలుగుదేశంలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్ ను, పెద్దిరెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల శాసనసభ్యులతో చర్చించారు. ఆ జిల్లాల శాసనసభ్యులు వారిద్దరి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో దేవేందర్ గౌడ్, తన సహచరుడు పెద్దిరెడ్డితో కలిసి వారం పది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. బుధవారం ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ తో జరిగిన సమావేశంలో దేవేందర్ గౌడ్ తాను పార్టీ వీడడం ఖాయమని చెప్పినట్లు తెలుస్తోంది. దేవేందర్ పార్టీని వీడరని చెప్పినప్పటికీ చిరంజీవి చేతుల్లో ఏమీ లేదని తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ పోవడం తప్ప ఆయన చేయగలిగిందేమీ కూడా లేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X