హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రిని మించని తనయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత కాంగ్రెసు నేత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తారా. అంత ఓపిక, సహనం జగన్ కు ఉన్నాయా. వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్న రాజకీయ చతురత ఆయనకున్నాయా. ఇవన్నీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు. తండ్రులు అత్యున్నత స్థానాలకు ఎదిగితే కొడుకులకు పైమెట్టుకు చేరుకోవడం సులభమవుతుంది. దీనికి రాజకీయాలు అతీతమేమీ కాదు. అయితే చాలా సందర్భాల్లో ఉన్నత స్థానాలను చేరుకున్న రాజకీయ నాయకుల కుమారులు చిన్న చిన్న పదవులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి రాజకీయాల్లో ఉంది. కాంగ్రెసు వంటి జాతీయ పార్టీల్లో ఇది మరీను. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి కుమారులను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మేధావిగా పేరు పొందిన మర్రి శశిధర్ రెడ్డి శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్నారు గానీ ఆయనను మంత్రి పదవి కూడా వరించడం లేదు. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు కుమారుడు పివి రంగారావు ఒక్కసారి మంత్రి పదవిని చేపట్టారు. అది కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలోనే. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. మరో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారులు రాజకీయాల్లో తమ స్థానాన్ని కాపాడుకోవడానికే తీవ్రంగా కష్టించాల్సి వస్తోంది.

అయితే, ఇందుకు వైయస్ జగన్ ను మినహాయింపుగా చెప్పేవారు ఉండవచ్చు. పోలిక తేవాల్సి వస్తే, మర్రి చెన్నారెడ్డి కన్నా వైయస్ రాజశేఖర రెడ్డి ఉద్ధండ రాజకీయ వేత్త ఏమీ కారు. కష్టకాలంలో అధిష్టానానికి అండగా ఉండి గడ్డు కాలంలో పార్టీని పునరుజ్జీవింపజేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత మర్రి చెన్నారెడ్డికి కూడా ఉంది. కానీ, దాన్ని చూపి మర్రి శశిధర్ రెడ్డి ఏనాడూ గొడవ చేయలేదు. వైయస్ రాజశేఖర రెడ్డే మర్రి శశిధర్ రెడ్డిని గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. అయినా మర్రి శశిధర్ రెడ్డి ఏ రోజూ బయట పడలేదు. పల్లెత్తు మాటా అనలేదు. జగన్ కు ఉన్న రాజకీయ అనుచర గణం, క్రియాశీలత వారికి లేదని అనే అవకాశాలు కూడా లేకపోలేదు. తమ తండ్రులు అధికారంలో ఉన్న కాలంలో వారెప్పుడు కూడా పాలనా యంత్రాంగంలో చేయి పెట్టలేదు. అధికారం నీడలో వ్యాపార లావాదేవీలను ఇనుమడింప జేసి అనతి కాలంలోనే కోట్లాది రూపాయల ఆదాయం గల పారిశ్రామికవేత్తలుగా ఎదగలేక పోయారు. అందుకు కారణాలు చెప్పాల్సి వస్తే, జగన్ ను కాకుండా రాజశేఖర రెడ్డినే తప్పు పట్టాల్సి ఉంటుంది. ఈ రోజు జగన్ ఆదాయం ఏడాదికి 70 కోట్ల రూపాయలని ఒక అంచనా. అతి కొద్ది కాలంలో ఇంతగా ఎలా ఎదిగాడని జగన్ ను ప్రశ్నించే వారు ఉన్నారు. ఆ ప్రశ్నలకు జంకకపోవడమే జగన్ ధైర్యంగా అనుకోవచ్చు. ఇటువంటి వాటికి ఎవరూ సమాధానం చెప్పలేరు.

కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి నిత్య అసమ్మతివాదిగా కాంగ్రెసులో చాలా కొనసాగుతూ వచ్చారు. తన హయాంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కోట్ల విజయభాస్కర రెడ్డికి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. అదే సమయంలో అధిష్టానానికి విశ్వాస పాత్రుడిగా కొనసాగుతూ వచ్చారు. అవసరం వచ్చినప్పుడు పార్టీ మనుగడ కోసం ఉద్యమాలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు కావాలంటూ ఆయన నడిపిన ఉద్యమం అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు కొరకరాని కొయ్యగా తయారైంది. కేంద్రంలో తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నా పెదవి విప్పి విమర్శలకు దిగలేదు. రాష్ట్రవ్యాప్తంగా రాజశేఖర రెడ్డికి అనుచర గణం ఉంది. ఈ అనుచర గణం కూడా తమ నేత వైయస్ కు అన్యాయం జరుగుతోందంటూ పార్టీపై తిరుగుబాటు చేసే పద్ధతిలో వ్యవహరించలేదు. ఇదంతా రాజశేఖర రెడ్డికి అనుభవం వల్ల, రాజకీయంలోని మర్మాలు తెలియడం వల్ల వచ్చింది. రాజశేఖర రెడ్డి ఎంత దూకుడుగా వ్యవహరించేవారో అవసరం వచ్చినప్పుడు అంత వ్యూహాత్మకంగానూ వ్యవహరిస్తూ వచ్చారు.

రాజశేఖర రెడ్డితో పోల్చదలిస్తే వైయస్ జగన్ కు సహనం లేదు, రాజకీయ చతురుత లేదు. మాటలను పదునుగా వాడడం, తెలివిగా వాడడం రాదు. ఆయన చేస్తున్న ప్రకటనలు గానీ ఆయన అనుచరగణం వ్యవహరిస్తున్న తీరు గానీ ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఆటంకంగానే మారుతున్నాయి. జగన్ ఏ మాత్రం ఓపిక పట్టడానికి సిద్ధంగా లేరని, అధికారం కోసం తపన పడుతున్నారని బాహ్య ప్రపంచానికి ఇట్టే తెలిసిపోయే విధంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన చుట్టూ చేరిన కొంత మంది నాయకులు, రాజశేఖర రెడ్డి పక్కన ఉన్న లాబీ మాత్రమే ఇప్పుడు జగన్ వైపు ఉంది. అయితే వీరంతా జగన్ వెంట సుదీర్ఘ కాలం ఉంటారని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అధికారంలో లేనప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వెంట నాయకులు చాలా మంది ఉన్నారు. వారంతా జగన్ ను రాజశేఖర రెడ్డిని చూసినట్లే చూస్తారని చెప్పడానికి కూడా ఏమీ లేదు. అందువల్ల జగన్ లో రాజకీయ వ్యూహ బలం కొరవడిందనేది స్పష్టంగానే చెప్పవచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పుల్లో కాళ్లు పెట్టడం కొడుకే అయినా జగన్ కు అంత సులభం కాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X