బాబు గొయ్యి తీసుకున్నారు

తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లు అంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబు అడ్డుకున్నారనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని చెప్పడానికి ఈ ఫలితాలు నిదర్శనం. ప్రజలు డ్రామాలను, కల్లబొల్లి మాటలను నమ్మరని రుజువు చేశారు. ఎన్నికల కోసమే ఆయన గతంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారనేది స్పష్టంగా తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవడానికి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పకనే చెప్పారు.
గత ఎన్నికల్లో తెరాసతో పొత్తు వల్లనే తాము గెలవలేకపోయామనే ఏకపక్ష విశ్లేషణ చేసుకున్నారు. తెరాసతో పొత్తు వల్లనే కనీసం ఈ మాత్రం సీట్లనైనా సాధించగలిగామా అనే ఆలోచన ఆయన ఏ క్షణంలో కూడా చేసినట్లు లేదు. చంద్రబాబు ఏకపక్ష అంచనాకు ఆయన భజన బృందం కూడా తందానా అంది. తెలుగుదేశంతో పొత్తు వల్ల నిజానికి తెరాస నష్టపోయింది. విజయావకాశాలున్న సీట్లను తెలుగుదేశం పార్టీకి వదిలేసింది. అంతేకాకుండా, వామపక్షాలు, తెలుగుదేశం మిత్రభేదానికి పాల్పడ్డాయనే విషయాన్ని తెరాస గుర్తించలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ విషయంలో సీమాంధ్ర ఆధిపత్యవాదుల వాదనలకు తలొగ్గి అదే ధోరణి కొనసాగిస్తారా, వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications