చిరు పార్టీ బలపడేనా?

Chiranjeevi
పార్టీ పటిష్టత గురించి ఇటీవలి కాలంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పదే పదే మాట్లాడుతున్నారు. పార్టీ నిర్వీర్యం కాలేదని, మళ్లీ పుంజుకుంటుందని చిరంజీవి తిరుపతిలో అన్నారు. పార్టీ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని కూడా అన్నారు. దానికితోడు, తెలంగాణలో కూడా తమ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని, తెలంగాణలో పార్టీ స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమేనని, అయితే మళ్లీ పుంజుకుంటామని ఆయన ఆ మధ్య కాలంలో అన్నారు.

చిరంజీవి మాటలు చూస్తుంటే కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం లేవు. పార్టీ విస్తరణ, పటిష్టత వట్టి మాటలుగానే మిగిలి పోయే అవకాశం ఉంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వ్యూహాల మధ్య చిరంజీవి దిగదిడుపే అవుతున్నారు. దానికి తోడు సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు తిరిగి పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. వారు ప్రజారాజ్యం పార్టీకి దూరంగానే ఉండదలుచుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ కూడా పార్టీ కార్యకలాపాలపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది. ఆయన పూర్తి సమయాన్ని సినిమాల నిర్మాణం మీదనే పెట్టారని అంటున్నారు. ఒకదాని మీద మరో సినిమా తీస్తూ ఆయన బిజీగా ఉంటున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా ఇటీవలి కాలంలో మంచి విజయాలు సాధిస్తున్నారు. అందువల్ల సినిమాలను వదిలి ఆయన పార్టీని బలోపేతం చేయడానికి సమయం వెచ్చిస్తారని అనుకోవడానికి లేదు.

ఈ స్థితిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత చిరంజీవి ఒంటరిగా మోయాల్సి వస్తోంది. వ్యూహరచన చేసి పకడ్బందీగా అమలు చేసే నాయకుడు కూడా ప్రజారాజ్యం పార్టీలో లేడు. చిరంజీవి ఇమేజ్ మీద ఆధారపడి విజయం సాధించాలని ఆశించినవారందరికీ నిరాశే ఎదురైంది. ఆ నిరాశతో చాలా మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. పార్టీలో ప్రస్తుతం ఉన్న కోటగిరి విద్యాధర రావు, సి రామచంద్రయ్య వంటి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి వ్యూహ రచన చేసి అమలు చేసే స్థాయిలో లేరు.

దానికి తోడు, తెలంగాణలో చిరంజీవి అడుగు పెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ వ్యతిరేక నిర్ణయం వల్ల ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేయడానికి రాజకీయ నాయకులు ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కోస్తాంధ్ర చిరంజీవి ఎంతగా పర్యటించినప్పటికీ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. చిరంజీవికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో పార్టీని బలోపేతం చేసే అవకాశాలు చిరంజీవికి నామమాత్రంగానే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+