విడిపోతే పడిపోతారా?

చిన్న రాష్ట్రాల దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించడమే కాకుండా ప్రజా సమూహాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. పంజాబ్, హర్యానా, కేరళ రాష్ట్రాల జిడిపి దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉండడమే అందుకు నిదర్శనం. కొత్తగా ఏర్పడిన చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు కూడా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ జిడిపి పరంగా కూడా వృద్ధిని సాధించాయి.
అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలు స్వయంపాలన సాగించుకుంటూ ఆత్మగౌరవంతో జీవించడానికి వీలవుతుంది. తెలంగాణ సహజ వనరుల దోపిడీ ఆగిపోయి ఈ ప్రాంతంలోనే వాటిని పూర్తిగా వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది.
తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాల్లోని తన న్యాయమైన వాటాను వాడుకుని అదనంగా 39 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడుతుంది. దాని వల్ల వ్యవసాయ రంగంలో ఏడాదికి 7800 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుంది. దాని వల్ల వ్యవసాయంలో, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
బొగ్గు నిల్వల ద్వారా అదనపు థర్మల్ విద్యుదుత్పత్తిని చేపట్టి గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ కోత లేకుండా వ్యవసాయానికి, పరిశ్రమలకు వాడుకోవడానికి వీలు కలుగుతుంది.
అపారంగా ఉన్న సున్నంరాయి నిక్షేపాల వల్ల స్థానికులు సిమెంటు కర్మాగారాలు స్థాపించుకోవడానికి అవకాశం చిక్కుతుంది. దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండడం వల్ల అందుకు అనుబంధమైన పరిశ్రమలను స్థాపించుకునే వీలుంటుంది.
స్థానికులకు అదనంగా రెండు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల అదనంగా 4800 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. దాంతో తెలంగాణ సంపద్వంతమవుతుంది.
విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి, సంబంధిత వృత్తుల్లో ఎదగడానికి అవకాశాలు పెరుగుతాయి.
తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహిస్తూ హస్తకళల యూనిట్లను స్థాపించి, కాటేజ్ పరిశ్రమలను అభివృద్ధి చేయవచ్చు.
రాష్ట్రంలోని మాదిగల్లో 70 శాతం మంది తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిష్కారమవుతుంది.
స్థానికులు కొత్త విద్యాసంస్థలను నెలకొల్పే అవకాశాలు లభించి, ప్రత్యేక కోర్సులను ప్రవేశ పెట్టడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా హెవీ, ఇంజినీరింగ్ పరిశ్రమలను స్థాపించే అవకాశం చిక్కుతుంది.
రెండో తరగతి పట్టణాలను గుర్తించి వైవిధ్య, సమతుల్య అభివృద్ధి కోసం గ్రోత్ కారిడార్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు - ఒక జిల్లాలో చేనేత జోన్, రెండో చోట ఐటి కారిడార్, మరో చోట లఘు పరిశ్రమలు, కాటేజ్ కేంద్రం, ఇట్లా.....
విద్యుదుత్పత్తి పెరుగుతుంది కాబట్టి గ్రామీణ విద్యుదీకరణ సాకారమవుతుంది.
రోడ్లు, భవంతులు, రైల్వే వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది.
మరిన్ని పరిశ్రమలను స్థాపించి ఉపాధి అవకాశాలు పెంచవచ్చు, స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించవచ్చు.
లఘు, కాటేజీ పరిశ్రమలను గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ప్రోత్సహించవచ్చు.
విశిష్టమైన పండుగలు, ఉత్సవాలు, జాతరల ద్వారా తెలంగాణ భాషను, సంస్కృతిని పరిరక్షించుకునే వెసులుబాటు దక్కుతుంది.
తెలంగాణలో 12 శాతం మంది గిరిజనులున్నారు. వారికి రిజర్వేషన్లు కల్పించి విద్యను, ఉపాధిని పెంచే అవకాశం లభిస్తుంది.
అన్ని రంగాల్లో పేదలు, పీడితులు, మైనారిటీలు, మహిళలు తమ తమ వాటాలు పొందుతారు.
చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవచ్చు. తద్వారా పర్యాటక, వినోద రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఆరోగ్యం, పారిశుధ్యం, ప్రజా వినియోగ సేవలు మెరుగుకు ప్రాధాన్యం ఇవ్వడానికి వీలవుతుంది.
చివరగా - ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, ప్రజా కేంద్రిత పాలన, ప్రజా చాలిత ప్రభుత్వానికి దారి తీస్తుంది.