అనైక్య 'సమైక్య'వాదం

కోస్తాంధ్రలో సమైక్యవాద ఉద్యమకారులుగా ముందుకు వచ్చిన కాంగ్రెసు నాయకుడు లగడపాటి రాజగోపాల్, మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు, కోడెల శివప్రసాద రావు రాయలసీమ నేతలను తమతో తీసుకుని వెళ్లలేకపోతున్నారు. అలాగే, రాయలసీమ నేతలు కోస్తాంధ్ర నాయకుల ప్రమేయం లేకుండా సమైక్యాంధ్ర జెఎసి కార్యక్రమాలు నడుపుతున్నారు. ప్రజారాజ్యం అధినేత ఆ రెండు కూటములతో ప్రమేయం లేకుండా విడిగా రాయలసీమ, కోస్తాంధ్రల్లో పర్యటిస్తున్నారు. మూడు పాయలు కలిసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడపకపోవడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే ఇందుకు కొన్ని కారణాలను మాత్రం వెతకడానికి అవకాశం ఉంది.
రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని నాయకులు ఏకాభిప్రాయంగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా ఆ వ్యతిరేకతలోని అంతరంగాలు వేర్వేరుగా ఉన్నాయి. మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రెండు ప్రాంతాలకు మధ్య శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక ద్వారా రాయలసీమకు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఆంధ్ర నాయకులు నిలబెట్టుకోలేకపోయారు. దాని వల్ల ఆంధ్ర ప్రాంత నాయకులపై రాయలసీమ నాయకులకు పూర్తి విశ్వాసం లేదు. తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర ప్రాంతం కింద నలిగిపోతామనే భయాందోళనలు రాయలసీమ నాయకుల్లో ఉండవచ్చు. తాము తెలంగాణతోనైనా కలిసి ఉంటాం గానీ ఆంధ్ర నాయకులతో కలిసి ఉండలేమని ఆ మధ్య ఒక చర్చాకార్యక్రమంలో ఓ రాయలసీమ నాయకుడు అనడం ఆ విషయాన్ని పట్టిస్తోంది. అందువల్లనే బహుశా రాయలసీమ నేతలు, కోస్తాంధ్ర నేతలు విడివిడిగా సమైక్య ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతాన్ని వదులుకుని పూర్తిగా పార్టీ పరంగానే సమైక్యవాదాన్ని భుజాన వేసుకున్న ప్రజారాజ్యం పార్టీకి రెండు ప్రాంతాల్లో కూడా సమైక్య జెఎసిలో స్థానం లేదు. చిరంజీవిని ఆ సమావేశాలకు పిలువడం లేదు. చిరంజీవి పైచేయి సాధిస్తారనే భయం వల్లనే వారు ఆ పనిచేస్తూ ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, సమైక్యవాదంతో ముందుకు దూకిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబును కూడా జెఎసి సమావేశాలకు ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. తెలంగాణవాదులతో సమైక్యవాదం కోసం తగాదాకు దిగి తీవ్రంగా నష్టపోయిన మోహన్ బాబు ఎటూ కాకుండా పోయారనే వాదన వినిపిస్తోంది. మొత్తం మీద, సమైక్యవాదం అనైక్యవాదాలతో ముందుకు సాగుతోంది. అయితే వాటినికి ఒక సూత్రత మాత్రం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విడివిడిగానే ఆయినా ఆ జెఎసిలు వ్యతిరేకిస్తున్నాయి.