• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీకృష్ణ కమిటీ ఏం చేస్తుంది?

By Pratap
|

Srikrishna
ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై ఏర్పడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని, ఉత్కంఠను పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ విధివిధానాలను వెల్లడించడంలో మరింత జాప్యం చేస్తోంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జస్టిస్ శ్రీకృష్ణ వెంటనే ఢిల్లీకి రాలేకపోవడం వల్లనే విధివిధానాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని బయటకు చెబుతున్నప్పటికీ విధివిధానాల ఖరారులో కేంద్ర ప్రభుత్వం డక్కా ముక్కీలు తింటున్నట్లు చెబుతోంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకనో, రాష్ట్ర విభజనకనో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పైనో అనకుండా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి ప్రకటించగలిగింది. రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు రెండింటికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కమిటీని ప్రకటించగలిగింది. కానీ, కమిటీ ఎందుకని చెప్పే విషయంలో నిర్దిష్టంగానే ఉండాల్సి వస్తుంది. అలా నిర్దిష్టంగా ఉండాల్సి వచ్చే సరికి కేంద్ర ప్రభుత్వానికి సమస్య తలెత్తుతోంది. తెలంగాణకు అనుకూలంగా ఉంటే సీమాంధ్ర నాయకులు వ్యతిరేకించవచ్చు, తెలంగాణకు అనుకూలంగా లేకపోతే తెలంగాణ నాయకులు విమర్శించవచ్చు. ఏదో ఒక ప్రాంతంలో ఆందోళన పెల్లుబుకవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా విధివిధానాలను ఖరారు చేయడం ఎలాగో అంతు పట్టడం లేదని తెలుస్తోంది.

నిజానికి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే వేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. బయటకు అనకపోయినా సీమాంధ్ర నేతల్లోనూ ఆ అభిప్రాయం ఉంది. అయితే విధివిధానాలు వెల్లడైన తర్వాత మాట్లాడవచ్చునని వారు అనుకుంటున్నారు. మొత్తం మీద, విడిపోవడాలనే అభిప్రాయానికి ప్రాతిపదిక ఏమిటి, కలిసి ఉండడానికి గల ప్రాతిపదిక ఏమిటనే విషయాలనే కమిటీ సంప్రదింపులు జరుపుతుందనేది మాత్రం ఏకాభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఇప్పటిది కాదని, యాభై ఏళ్ల నుంచి ఈ డిమాండ్ ఉందని, అందుకే తెలంగాణ అంశం ప్రత్యేకమైందని, కమిటీ ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంపై మాత్రమే అధ్యయనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి శరద్ పవార్ కూడా వెల్లడించారు.

కమిటీలోని ఐదుగురు సభ్యులు కూడా వివిధ రంగాల్లో నిపుణులు. తమ తమ రంగాల్లో విస్తృత అధ్యయనాలు చేసినవారు. వారి నైపుణ్యాలను పరిశీలిస్తే రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఒక్క వెనకబాటుతనమే కాకుండా సామాజిక, సాంస్కృతిక దృష్టికోణం నుంచి కూడా అధ్యయనం జరిగే అవకాశం ఉంది. హోం శాఖ మాజీ కార్యదర్శి వికె దుగ్గల్ మెంబర్ సెక్రటరీ కాబట్టి కమిటీ పని సులువుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రణబీర్ సింగ్ కు హైదరాబాదుతో పరిచయం ఉంది. హైదరాబాదులో జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆయన చొరవతోనే ఏర్పడింది. ఈ విశ్వవిద్యాలయం తొలి వైస్ చాన్సలర్ గా కూడా ఆయన పని చేశారు. అలాగే, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ హ్యూమానిటీస్, సామాజిక శాస్త్రాల్లో నిష్ణాతురాలు. అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. హైదరాబాదుతో ఆమెకు కూడా పరిచయం ఉంది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ సీనియర్ ఫెలో అబూసలే షరీఫ్ కూడా తన రంగంలో అత్యంత నిష్ణాతులు. వీరంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన బహు కోణాలను పరిశీలించే అవకాశం ఉంది.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీకి గడువు కూడా ఎక్కువ పెట్టకపోవచ్చు. ఈ కమిటీ ఢిల్లీ నుంచి, హైదరాబాదుల నుంచి పని చేసే అవకాశం ఉంది. కమిటీ సభ్యులు విస్తృతంగా క్షేత్ర పర్యటన చేసే అవకాశాలున్నాయి. రాజకీయ నాయకులు, మేధావుల అభిప్రాయాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించే అవకాశం ఉంది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై, రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనపై, సహజ వనరులపై అధ్యయన చేసే అవకాశం ఉంది. ఫజల్ అలీ కమిషన్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణపై తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

ఇలా, ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాకుండా దేశంలో తలెత్తుతున్న ఇతర రాష్ట్రాల విభజన సమస్యలకు కూడా ఒక్క పరిష్కార మార్గాన్ని చూపే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర విభజనకు పరిగణనలోకి తీసుకునే అంశాలను కమిటీ క్రోడీకరించే అవకాశం ఉంది. దాని వల్ల ఇతర రాష్ట్రాల్లోని విభజన డిమాండ్ల పరిష్కారానికి ఇది ఒక బ్లూప్రింటులా ఉపయోగపడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X