'చిరు' కథనాలెందుకు?

ఇప్పుడు చిరంజీవి పార్టీ పతనమైనందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రశ్న. చిరంజీవి కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. చిరంజీవి వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కనాకష్టంగా తయారైంది. ప్రజారాజ్యం పార్టీ వల్లనే తాము గత ఎన్నికల్లో ఓడిపోయామనే విశ్లేషణకు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. తెలుగుదేశం పార్టీకి విధానపరంగా అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యం అందుకు అనుగుణంగానే వార్తాకథనాలను రాస్తూ వస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రీత్యా చిరంజీవిని నైతికంగా దెబ్బ తీయడానికి ప్రజారాజ్యం పార్టీపై ఆంధ్రజ్యోతి వార్తాకథనం రాసిందనే విమర్శలున్నాయి. గతంలో కొన్ని ప్రజా సంఘాలు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి దగ్గర కావడం కాంగ్రెసు పార్టీకి బలం చేకూర్చే విధంగా తయారైన పరిస్థితిలో కూడా ఆ ప్రజా సంఘాల నాయకులపై ఆంధ్రజ్యోతి విమర్శనాత్మక వార్తాకథనం ప్రచురించింది. ఆ సమయంలో కూడా ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరిగింది.
కాంగ్రెసు ప్రయోజనం చేకూర్చే పరిణామాలు చోటు చేసుకున్న ప్రతి సందర్భంలోనూ, తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగుతుందని భావించిన ప్రతి సమయంలోనూ ఆంధ్రజ్యోతిలో కొన్ని శక్తులపై విమర్శనాత్మక వార్తాకథనాలు రాయడం పరిపాటి అయిందనే వాదన ఒకటి ఉంది. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం చాలా తెలివిగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. అట్లని, మీడియా కార్యాలయంపై దాడులను ప్రోత్సహించడం, దాడులను ఖండించకపోవడం సరి కాదు. ఆ దాడులను వ్యతిరేకిస్తూనే వార్తాకథనాల పాక్షికతను బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిస్పందించి ఉంటే బాగుండేది.












Click it and Unblock the Notifications