జూ ఎన్టీఆర్‌కు ఆ సత్తా ఉందా?

కృష్ణా జిల్లా రాజకీయాలు వీధిన పడిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు రాజకీయ పాత్రపై చర్చ ప్రారంభమైంది. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే నేత ఎవరనే చర్చ కూడా అదే సమయంలో సాగుతోంది. తాత ఎన్టీ రామారావును స్ఫూర్తిగా భావించి, ఆయనను ఆరాధ్యదైవంగా ఆరాధించే జూనియర్ ఎన్టీఆర్ తాతలాగే రాజకీయాల్లో కూడా అడుగు పెడతారా అనే ఆలోచన చాలా కాలంగానే ఉంది. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన చాలా వరకు సీనియర్ ఎన్టీ రామారావును తలపించారు.
సినీ రంగంలో జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. నెమ్మదిగా, ఓపికతో తన లక్ష్యాన్ని సాధించడం జూనియర్ ఎన్టీఆర్ మార్గంగా చెప్పుకోవచ్చు. సినీ రంగంలో ఆయన సంపాదించుకున్న ఇమేజ్‌ను, దాన్ని సొంతం చేసుకున్న తీరును బట్టి చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. నందమూరి కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా గుర్తింపు పొందడానికి ఆయనకు సినీ కెరీర్ ఎంతగానో ఉపయోగపడింది. బాబాయ్ బాలకృష్ణ తప్ప నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను మించినవారు లేరు. ఎన్టీ రామారావు మనవళ్లలో జూనియర్ ఎన్టీఆర్‌దే పైచేయి.
సినీ రంగం ద్వారా తన సత్తా చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా అదే పని చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రి నందమూరి హరికృష్ణ నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్‌ను తన వారసుడిగా మందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం కోసం నందమూరి హరికృష్ణ సిద్ధం చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.