జగన్, కిరణ్ మధ్య ఎమ్మెల్యేల క్రీడ

జగన్ వైపు గట్టిగా ఉన్న శాసనసభ్యులు నిజానికి పిడికెడు మంది మాత్రమే. కొండా సురేఖ, ఆదినారాయణ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, కమలమ్మ, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి వంటి కొద్ది మంది శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు గట్టిగా నిలబడుతున్నారు. రాజీనామాలు చేయకుండా జగన్ వెంట నడవడానికి గల వెసులుబాటు దండిగా శాసనసభ్యులకు లభించింది. జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెసు నాయకత్వం హెచ్చరిస్తున్నప్పటికీ చర్యలు తీసుకునే సాహసానికి ఒడిగట్టలేదనే దీమా ఏర్పడింది. దీంతో వైయస్ జగన్ వైపు వెళ్తున్నట్లు చాలా మంది శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డికి ఓ రకమైన భావన కల్పిస్తున్నారు.
జగన్ వైపు వెళ్తున్నట్లు తెలియగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు. వారి సమస్యలేమిటో అడిగి తెలుసుకుంటున్నారు. తమ పనులు కావడం లేదని, అందుకే జగన్ వైపు వెళ్లాలని అనుకుంటున్నామని వారు కిరణ్ కుమార్ రెడ్డికి చెబుతున్నారు. అంతే, కిరణ్ కుమార్ రెడ్డి వారికి వరాలు ఇచ్చేస్తున్నారు. దీంతో శాసనసభ్యుల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. కాంగ్రెసు వైపు గట్టిగా నిలబడిన శాసనసభ్యులు మాత్రం ఆ ప్రయోజనానికి నోచుకోవడం లేదు.
జగన్ వర్గం, కాంగ్రెసు నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా ఓ ప్రహసనంగా సాగుతున్నాయి. వైయస్ జగన్ వర్గం సందులో సందుగా తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాసం ప్రతిపాదించడం లేదని అడుగుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు కమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నారు. జగన్ వర్గానికి ఉపయోగపడేలా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడమెందుకని చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారు. మొత్తం మీద, రాష్ట్ర రాజకీయాలు రసవత్తరమైన నాటకాన్ని తలపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications