• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరుకు ఆత్మగౌరవం సున్నా?

By Pratap
|

Chiranjeevi
అనివార్యమైన విలీనం జరిగింది. రాష్ట్రప్రజానీకం మొత్తం మానసికంగా ఎప్పుడో సిద్ధమయిపోయిన విషయం అందరికి తెలిసిందే. తప్పులేదు. కాంగ్రెస్ కి కొంచెం ఊపిరి పీల్చడానికి అవకాశం దొరికింది. చిరంజీవికి నేనూ ఒక ముఖ్య నాయకుడిని అని చెప్పుకోవడానికి ఆస్కారం కలిగింది. ఆయన కోసం పిఆర్పీ పార్టీ కోసం రక్తాన్ని, డబ్బుని, ఆశలని, అశ్రువుల్ని ధారపోసిన అశేష అభిమానుల కోసమే ఈ విలీనం అయితే చాలా మంచిది. కాని తన అవసరాల కోసం తన కుటుంబం కోసం అయితే మాత్రం ఇది ఒక చారిత్మాత్మిక తప్పిదం. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఒక పాడి గేదని (జగన్) ఇంట్లోంచి తరిమి ఒక వట్టి గేదని (చిరంజీవి) పక్కింట్లోంచి తెచ్చి గుంజకి కట్టేయడంలోనే వారి ప్రతిభేంటో అర్ధమవుతుంది. ఇరు పార్టీల అవసరాలమీరకు జరిగిన ఒప్పందం ఇది. కాంగ్రెస్ కి రాష్ట్రంలో మిగిలిన మూడేళ్ళు అధికారం కావాలి, తర్వాత ఎన్నికలలో ఒక ఆకర్షణీయమయిన ముఖంతో ప్రజల ముందుకి పోవాలి. పార్టీ పెట్టేప్పుడు ఉన్న ప్రజాబలం, మద్దత్తు చాలావరకు కోల్పోయిన చిరంజీవికి ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కావడం, వచ్చే ఎన్నికలనాటికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండటం అత్యంత అవసరం. ఈ వీరి వీరి స్వప్రయోజనాల్నిదేశం లేక రాష్ట్ర చారిత్మాత్మిక అవసరాలు అని సోనియమ్మ చిరంజీవి అనుకుంటే ప్రజలు నమ్మడానికి వారేమి వేర్రోళ్లు కాదు.

వైఎస్స్ జగన్ వర్గానికి సంభందించిన నాయకులకి ఈ విలీనం పైన స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్ళకి కనబడని ఇంకో విలీనం జరిగింది. జగన్ అనే శక్తిని ఎదుర్కొనడానికి చంద్రబాబు, టిడిపి, ఆ రెండు పత్రికలు ఎప్పుడో కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. విచిత్రమేమిటంటే ప్రజలకి ఈ విషయం ఎప్పుడో అవగతమయింది. వైఎస్స్ జగన్ కి సంభందించినంత వరకు ఇది చిరంజీవి పిఆర్పిని కాంగ్రెస్ కి ధారబోయడం కంటే, తనని తాను సోనియమ్మకి సమర్పించుకోవడం కంటే ముఖ్యమయినది. ఈ విషయాన్ని ప్రజల ముందు పదే పదే ఉంచి వారి మద్దతు ఈ అనైతిక పొత్తుకు వ్యతిరేకంగా కూడగట్టాలి.

ఒక్క వైఎస్స్ జగన్ అనే శక్తిని ఎదుర్కొనడానికి రాష్ట్ర రాజకీయ పక్షాలన్నీ ఏకమవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆయనకీ, ఆయనవెనుకున్న వైఎస్సార్ అంశ కి , యావత్తు రాష్ట్ర ప్రజలకి, మరియు వైఎస్సార్ అభిమానులకి ఇదో పెద్ద విజయం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రం లో వైఎస్సార్ కి ఉన్న మంచిపేరుకి , చనిపోయినా ఆయనకున్న శక్తికి ఇదో నిదర్శనం. సమర్పించుకోగానే మేడం మాట ప్రకారం తూఛ తప్పకుండా వైఎస్సార్ ని విమర్శించిన చిరంజీవికి ఒక వ్యక్తిత్వం అనేది లేదు అని నిరూపించుకున్నాడు. ఇవి ఏ రోజు ఒక మాటిచ్చి నిలబెట్టుకొనే ఉద్దేశమే లేని ఒక త్రుచ్చ చవకబారు బజారు వ్యక్తి అనే మాటలు. సూర్యుడి లాంటి వ్యక్తిపై ఉమ్మేస్తే తనముఖమే ఖరాబవుతుందనే కనీస జ్ఞానం లేని ఒక మూర్ఖుడు అనే మాటలు. మంత్రి పదవి తీసుకో, బావమర్దిని రాజ్యసభకి పంపు, గవర్నమెంటులో పలుకుబడి పెంచుకో. కాని ప్రజలకి కల్లబొల్లు కబుర్లు చెప్పి, రాష్ట్రంలో పార్టీని స్థాపించి, ఒక పద్దెనిమిది ఎంఎల్ఏలని కాంగ్రెస్ ని విమర్శిస్తూ గెలిపించిన ప్రజలకి కనీస గౌరవం ఇవ్వకుండా తన అవసరాల కోసం డిల్లీలో సోనియమ్మకి సమర్పించిన చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ అంటే నచ్చక గెలిచిన పదవికి రాజీనామా చేసి బయటకి వచ్చిన వైఎస్స్ జగన్ కి ఉన్న తేడా నక్కకి నాగలోకానికున్నంత అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. వైఎస్సార్ ఉన్నప్పుడు గొంతే పెగలని ఈ నటనాయకుడికి ఈ రోజు సోనియమ్మ వాపు చూసి తనకి చాలా బలమోచ్చింది అని ఆ మహానాయకుడి మీద అవాకులు చవాకులు వాగడం చిరంజీవి వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. సోనియా గాంధీ ఆదేశాలమేరకు వైఎస్సార్ అనే కాంగ్రెస్ రక్షకుడి గుర్తుల్ని రాష్ట్ర ప్రజల గుండెల్లోంచి తొలిగించడానికి చేసే ఒక విఫల ప్రయత్నంలో ఒక విహెచ్, ఒక డిఎల్, ఒక కేకే కంటే ఈ చిరంజీవి గొప్ప కాదు అనే విషయం ప్రస్పుటపరుస్తున్న చందం ఆయన అవివేకం మాత్రమే. ఇది ఎప్పటికీ జరిగే అవకాశమే లేదనే విషయాన్ని ప్రజలు ప్రతి రచ్చబండలో, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో తెలియజేస్తున్నారు.

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈ ప్రభుత్వాన్ని ఎలా రక్షించుకుందామని చూస్తుంటే చిరంజీవి అల్లు అరవిందులు ఎలా బేరం ఆడి వారి పిఆర్పి పార్టీని అమ్మి సోమ్ముచేసుకున్దామని ఆలోచించారు కాని ప్రజా శ్రేయస్సు ఎవరికీ పట్టకపోవడం ప్రజలు గమనించారు. పవిత్ర తిరుపతిలో సామాజిక న్యాయం నినాదంతో డెబ్భై లక్షలమంది ప్రజల ఆమోదంతో పుట్టిన పీఆర్పిని ధిల్లీ లోని ఇటాలియన్ సోనియా గాంధీ పాదాలముందు తాకట్టు పెట్టబడింది. పదవీ వ్యామోహంతో చేసిన ఈ నిర్వాకం చాలదన్నట్టు సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సోనియా గాంధీతోనే సాధ్యం అని బుకాయింపు చేస్తున్న ఈ నటనా నాయకుడు ఎవర్ని మోసం చేస్తాడు ఇంకా?

ఇక తెలుగు దేశం చంద్రబాబు విషయానికొస్తే రెండు కళ్ళు నాలుగు నాలికలు పదహారు అబద్ధాలు సిద్ధాంతంతో రాష్ట్రం మొత్తం మీద ప్రజామోదం కోల్పోయి అన్ని వర్గాలకి దూరం అయిపోయి ఇది ఒకప్పుడు కాంగ్రెస్ మీద పోరాటం చేసిన పార్టీ ఏనా అనిపించే రీతిలో ఉంది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే సంఖ్యాబలం సులభంగా దక్కే పరిస్థితి ఉన్నా కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం అనే వెర్రి మాటలు మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఇంకొక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం ఎప్పుడూ ఎల్లప్పుడూ అవిశ్వాసం ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉండాలనే ఒక గురుతర బాధ్యతని మర్చిపోయిన ఈ తెలుగు దేశం ఒక ప్రతిపక్షం గానే కాదు ఒక రాజకీయ పక్షంగా కూడా ఉండటానికి అర్హత కోల్పోయింది. ఎంతసేపటికి నాటకాలు తప్ప ప్రజా సమస్యలపైన కూడా స్పందించడం మానేసింది. ఈ తెలుగు దేశం పార్టీ ఎంత సేపు ఇలా తన కర్తవ్యాలని మరిచి మసలుతుందో అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

వైఎస్స్ జగన్ ని చాలా మంది చాలా అన్నారు. అతని సిద్ధాంతాలు అతను చేసే అలుపెరగని పోరాటాలు, ప్రొద్దున ఏడింటి నుంచి తెల్లవారి నాలిగింటి వరకు చేసిన ఓదార్పు యాత్ర అతనిలోనే పట్టుదలని సూచిస్తున్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ సోనియా గాంధీలు చేస్తున్న అన్యాయాలని ఎదిరించి వారిపై తిరుగుబాటు జండాను ఎగురవేసిన ఈ నవతరం కధానాయకుడిగా, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పై పైకి పెంచిన అతన్ని అభినందిచాల్సింది పోయి అదే కాంగ్రస్ తో అదే సోనియా గాంధీతో బయట (చిరంజీవి) లోపల (చంద్రబాబు) ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ఈ తెలుగు రాజకీయ నాయకులు జగన్ అవినీతి సంపాదనంటు నోరు పారేసుకోవడం రొజూ సాగే ఒక బుర్రకధ. ఇది వినీ వినీ వారికి తట్టే ఒక ప్రశ్నకి వీరి సమాధానం ఏమిటో మరి? అంత సొమ్ముచేసుకుని ఎక్కడో భవంతుల్లో కూర్చుని, సోనియమ్మ అడుగులగు మడుగులొత్తుతూ హాయిగా ఇంకా సంపాదించుకోకుండా ప్రతి క్షణం భార్యకి బిడ్డలకి దూరం ఉంటూ ప్రజల కోసం ఆరోగ్యం చెడిపోయేలా పగలనక రాత్రనక ప్రజల మధ్యలోనే ఉంటూ ఈ దీక్షలు, ఈ ఓదార్పులు, ఈ ప్రజా పోరాటాలు ఎందుకు చేస్తున్నాడో? ఘనతవహించిన రెండెకరాల ఆసామి ఈ రోజు రెండు లక్షల కోట్లు సంపాదించి, సామాజిక న్యాయం అని గొంతిత్తి సోషోచ్చేదాక అరిచిన ఇంకో పెద్దమనిషి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకుండా డిల్లీ బజార్లో ఒక విదేశి వనిత ఇంటి ముందు అదే పనిగా వేచి వేచి పార్టీని అమ్మేసి ఒక పోరాట తెలుగు బిడ్డని విమర్శించడం తప్పు తప్పు. వారు మూర్ఖులు కావచ్చు కాని ప్రజలు కాదు. ఎందుకంటే ఈ ప్రజలే 2004, 2009 లో పత్రికలు, రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఊదరకోట్టినా వారు పట్టించుకోకుండా వారి పక్షానే ఉన్న ఒక మహా నాయకుడికి పట్టం కట్టారు. ఇదే చరిత్ర త్వరలోనే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది!

గురవా రెడ్డి, అట్లాంటా, జార్జియా (యు ఎస్ ఏ)

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NRI Guruva Reddy on Prajarajyam merger in Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more