సోనియాకు జగన్, తెలంగాణ చిక్కులు

Sonia Gandhi
తెలంగాణ సమస్యతో పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారాన్ని కూడా తక్షణమే తేల్చాల్సిన అనివార్యతలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పడ్డారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణపై అధిష్టానం మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. అలాగే, వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై ఏ విధమైన చర్యలూ తీసుకోకపోతే చులకన భావం ఏర్పడుతుందనే ఆందోళన సోనియాను చుట్టుముడుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఈ రెండు సమస్యలపైనే శుక్రవారం జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీలో చర్చించారు.

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించారు. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చ సాగింది. తెలంగాణ సమస్యకు సంబంధించి పార్టీ ఎంపీలతో సంప్రదింపుల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించారు. ఇది పూర్తయ్యాక మళ్లీ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని కోర్‌ కమిటీ సమావేశం పూర్తయిన తర్వాత కేంద్ర హోంమంత్రి చిదంబరం విలేకరులకు తెలిపారు. ఈ నెల 24వ తేదీన చిదంబరం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాజకీయ, రాజకీయేతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సమస్యపై ఆచి తూచి అడుగు వేయాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది.

ప్రధానమంత్రి నివాసంలో 90 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల చుట్టే తిరిగింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, హోం మంత్రి చిదంబరం, రక్షణమంత్రి ఆంటోనీ, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ తెలంగాణ ఎంపీలు ఇప్పటికే తనతో రెండుసార్లు భేటీ అయ్యారని, దీనిని కొనసాగించాల్సి ఉంటుందని ప్రణబ్‌ నేతలకు వివరించారు. తెలంగాణ సమస్యపై ఇంకా ఏకాభిప్రాయం రానందున, మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్య గురించి చర్చిస్తున్నపుడే జగన్‌ ప్రస్తావన కూడా వచ్చింది. జగన్‌ ఇటీవల ఢిల్లీలో జలదీక్ష నిర్వహించడం, ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన చేయడం, రాష్ట్ర ప్రభుత్వ కూల్చివేతకు సంబంధించి ప్రస్తావన చేయడం చర్చ కొచ్చాయి. జగన్‌తోనూ, జగన్‌ అనుచరులతోనూ ఇక కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోర్‌ కమిటీ నిర్ణయించింది. జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+