జగన్, తెలంగాణ రాజీనామాలు తేల్చాల్సిందే?

నాగం జనార్దన్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాలను స్పీకర్ ఇప్పటికే ఆమోదించారు. తెలుగు దేశానికే చెందిన హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న జోగు రామన్న, గంప గోవర్ధన్ రాజీనామాల సంగతి కూడా తేలాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు, రాజయ్య రాజీనామాలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన రాజీనామాను ఆమోదించవద్దని స్పీకర్‌ను కోరారు. టిడిపికి చెందిన 31 ఎమ్మెల్యేల రాజీనామాలు ఆయన వద్ద ఉన్నాయి. వాటిపై స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 26 మంది రాజీనామాలు చేశారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన కుంజా సత్యవతి, కొండా సురేఖలు మాత్రం తాము ప్రత్యేక రాష్ట్రం కోసమే రాజీనామా చేశామని ప్రకటించిన నేపథ్యంలో టిడిపిపై తీసుకునే నిర్ణయమే వారిపై తీసుకోవచ్చు. అయితే కొండా సురేఖ, శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథరెడ్డిలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కాంగ్రెస్ నుంచి స్పీకర్‌కు ఫిర్యాదు అందింది. ప్రజారాజ్యం పార్టీ నుంచి శోభా నాగిరెడ్డిపైనా ఫిర్యాదు అందింది. స్పీకర్ ముందు వీటిపై వాదోపవాదాలు ప్రారంభం కావాల్సి ఉంది. రాజీనామాలు చేసిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు బయట ఒక మాట, లోపల ఒక మాట చెబుతుండటంతో స్పీకర్ నిర్ణయం సంక్లిష్టంగా మారినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications