ఆగిన కిరణ్ కుమార్ రెడ్డి పాలన!

దీంతో రాష్ట్ర మంత్రివర్గం ఒకటంటూ ఉందనే విషయాన్ని మరచిపోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన 12 మంది తెలంగాణ ప్రాంత మంత్రులు సచివాలయం మొహం చూడడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మంత్రులు విధులకు హాజరు కావడానికి ఆసక్తి చూపడంలేదు. సీమాంధ్రకు చెందిన వారిలో మహీధర్ రెడ్డి, వట్టి వసంత కుమార్‌తోసహా నలుగురైదుగురు మాత్రమే సిన్సియర్‌గా సచివాలయానికి వచ్చి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంతకాలం కిందటి వరకు ముఖ్యమంత్రి వద్ద వేల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉండేవి. రాజకీయంగా పరిస్థితులన్నీ కుదుటపడటంతో ఆయన పూర్తిగా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం దాకా సచివాలయంలో ఉండి ఫైళ్లను పరిశీలించసాగారు. దీంతో ఆయన వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సీఎం క్రమం తప్పకుండా సచివాలయానికి వస్తుండటంతో మిగిలిన మంత్రులూ వచ్చి శాఖాపరమైన బాధ్యతలు నిర్వహించేవారు.
మూడు నాలుగు రోజులుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి రెండు రోజులుగా క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలతో తలెత్తిన సంక్షోభ నివారణపై ఆయన దృష్టి పెట్టారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తిరుపతి వెళ్లిన ఆయన హుటాహుటిన నగరానికి చేరుకున్నప్పటికీ గురువారం సచివాలయానికి దూరంగానే ఉన్నారు. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు పూర్తిగా పాలనకు దూరంగా ఉండటంతో సచివాలయంలో వేలాది ఫైళ్లు పేరుకుపోయాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే 1200 వరకూ ఫైళ్లు క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి చాంబర్‌లో 230 ఫైళ్లు మూలన పడ్డాయి. ఆయన ఎప్పుడూ నియోజకవర్గానికే పరిమతమవుతూ, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి సత్యసాయిబాబా ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు పుట్టపర్తికి పరిమితమయ్యారు. ఆ తర్వాత కూడా తన శాఖ గురించి పట్టించుకున్నది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆమె శాఖలోనూ పెద్దసంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్ రెడ్డికి శాఖాపరమైన అవగాహన తక్కువనే విమర్శలు ఉన్నాయి. అవగాహన లోపమా? లేక నిధుల కొరత కారణమా? ఏదైతేనేం... సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి 320 ఫైళ్లు ఆయన వద్ద పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నాయి. హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద 170 వరకూ ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. మౌలిక వసతుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద 125 ఫైళ్లు పెండింగ్!
బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజ్ సారయ్య వద్ద 210 ఫైళ్లు పరిశీలనకు నోచుకోక పక్కన పడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కళాశాలలు ప్రారంభమయ్యాయి. అడ్మిషన్లు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో బీసీ విద్యార్థులు, హాస్టళ్లకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో పడటం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత కీలకమైన పౌరసరఫరాల శాఖలోనూ 180 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఇటీవలే దేవాదాయశాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. ఆయన వద్ద ఐటీ శాఖకు సంబంధించి 80, దేవాదాయ శాఖకు చెందిన ఫైళ్లు 300 వరకూ పెండింగ్ పడి ఉన్నాయి. మంత్రి, ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులు మొత్తం ఐదు స్థాయుల్లో పని చేస్తేనే ఫైలు క్లియర్ అవుతుంది. అలాంటిది, మంత్రి స్థాయిలోనే ఫైళ్లు పెండింగ్‌లో పడటంతో కార్యదర్శులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. మరో వైపు బంద్‌లు, ఆందోళనలతో సచివాలయంలో సిబ్బంది హాజరు బాగా పడిపోయింది.












Click it and Unblock the Notifications