తెలంగాణ: బాబుకు మనుగడ, జగన్‌కు ప్రతిష్ట

మొదటి రోజు అదిలాబాదులో యాత్ర కాస్త సాఫీగా సాగినప్పటికీ రెండో రోజు మాత్రం అడుగడుగునా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు బాబుకు సవాల్ కానున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో సీట్లు గెలిస్తే లాభమే, కానీ గెలవకున్నా అంతగా నష్టముండదు. కానీ తెలంగాణ సీట్లు మాత్రం టిడిపి మనుగడకే ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయని పలువులు అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 294 నియోజకవర్గాలలో తెలంగాణలోనే 119 ఉన్నాయి.
అలాంటప్పుడు తెలంగాణలో వరుస దెబ్బలు తగిలితే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇప్పుడు కూడా ఓడిపోతే పార్టీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉందని తెలంగాణ క్యాడర్‌లోను అనుమానాలు ఉన్నాయట. అయితే రెండు కళ్ల సిద్ధాంతం పైనే ఈసారైనా గెలవాలని బాబు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరో విషయమేమంటే టిడిపి నుండి వెళ్లిపోయిన నేతల నియోజకవర్గాలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
మరోవైపు తెలంగాణలో ఉప ఎన్నికలు జగన్ ప్రతిష్టకు గీటురాయి కానున్నాయి. జగన్ కొత్తగా పార్టీ పెట్టినప్పటికీ ఆయన హవా ఇప్పటి వరకు సీమాంధ్రలోనే కొనసాగింది. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేల్లోనూ కొండా సురేఖ తప్పితే అంతా అక్కడి వారే. సీమాంధ్రతో పాటు తెలంగాణలోనూ తమ పార్టీకి బలముందని జగన్ భావిస్తున్నారు. పార్టీ నేతలు కూడా ఆ విషయాన్నే చెబుతున్నారు. అందుకే సీమాంధ్రతో పాటు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలని జగన్ దాదాపుగా నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన బలం నిరూపించుకోవాలంటే జగన్ సీట్లు గెలవకున్నా కిందిస్థాయికి పడిపోకుంటే చాలు. దివంగత వైయస్ పేరు తనకు లబ్ధి చేకూరుస్తుందనే గట్టి విశ్వాసంతో జగన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications