వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దిరెడ్డి, అసదుద్దీన్ వార్నింగ్: ప్రమాదంలో కిరణ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy and Peddireddy and Asaduddin
అధికార కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీల అల్టిమేటం జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిక్కుల్లో పడ్డారనే చెప్పవచ్చు. తొలి నుండి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్‌గా పెట్టుకున్న పెద్దిరెడ్డి మరోసారి పెదవి విప్పారు. నవంబరులోపు కిరణ్‌ను పదవి నుండి తొలగించాలని లేకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

ఆయన ఆదివారం చిత్తూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు. అధిష్టానానికి ఇదే తన చివరి హెచ్చరిక అన్నారు. తనతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనుభవం లేని వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టడం వల్లనే కాంగ్రెసు పరిస్థితి రాష్ట్రంలో ఇలా తయారయిందన్నారు.

పార్టీ పరిస్థితి ఇప్పటికే అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇదిలాగే ఉంటే ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. కిరణ్‌ను కొనసాగిస్తే కాంగ్రెసు కోలుకోలేదన్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా పదవిలో కొనసాగే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధిని రెండేళ్లుగా కిరణ్ అడ్డుకుంటున్నారని ద్వజమెత్తారు. కిరణ్‌ను ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందే అన్నారు.

మరోవైపు ఎంఐఎం కూడా కాంగ్రెసు పార్టీ మద్దతు ఇచ్చే విషయమై పునరాలోచించనుంది. ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కాంగ్రెసుకు మద్దతివ్వాలా లేదా అనేది భేటీ అయి నిర్ణయించుకోనున్నారు. చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం వివాదం కారణంగానే అసదుద్దీన్ అవసరమైతే కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరిస్తామని హెచ్చరించారు. కాంగ్రెసుకు తొలి నుండ అండగా ఉన్న ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంటే కిరణ్ ప్రభుత్వం గట్టెక్కటం కష్టమే.

ఎంఐఎంకు తోడుగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా రాజీనామా చేస్తే.. ఎలాగూ ప్రభుత్వం పడిపోతుందని భావించే పలువురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా కిరణ్‌కు అండగా నిలిచే అవకాశాలు లేవని అంటున్నారు. జగన్ వైపుకు జంప్ అవుదామని భావించే ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి బాటలోనే నడిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పెద్దిరెడ్డి మొదటి నుండి తాను కిరణ్‌ను గద్దె దింపే వరకు పోరాడుతానని చెప్పారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంటే కనుక పెద్దిరెడ్డి దీనిని సద్వినియోగం చేసుకొని కొంతమంది ఎమ్మెల్యేలను తన దారిలో నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం కాంగ్రెసు బలం 156గా ఉంది. ఎంఐఎంకు 7గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టారు. అందులో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉన్నారు. కాంగ్రెసు బలం మూడు తగ్గింది. అయితే కిరణ్ ప్రభుత్వం పడిపోతుందని తెలిస్తే మరికొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి జగన్ గూటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఉండాల్సిన మెజార్టీ 148.

English summary

 Former minister Peddireddy Ramachandra Reddy and MIM MP Asaduddin Owaisi warned Congress party High Command on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X