నెల్లూరు: టిఎస్సార్ సినీకలర్స్, మేకపాటి సెంటిమెంట్

ఈ నియోజకవర్గంలో గెలుపుపై ఎప్పటికప్పుడు అంచనాలు మారుతున్నాయట. ఈ స్థానానికి ఇప్పటి వరకు 15 ఎన్నికలు జరిగితే 12సార్లు కాంగ్రెసు పార్టీ పతాకమే రెపరెపలాడింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ పార్టీ నేతల్లో పూర్తి ధీమా కనిపించడం లేదు. ప్రచారంలో సుబ్బిరామి రెడ్డి దూసుకుపోతున్నా సందిగ్ధం తొలగడం లేదు. అర్ధబలం, రాజకీయ ఎత్తుజిత్తుల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులూ దీటైనవారు కావడమే దీనికి కారణం. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డి పదవికి, పార్టీకి రాజీనామా చేసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గ పరిధిలో కందుకూరుతోపాటు కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 13.51 లక్షల ఓటర్లలో రెడ్డివర్గం 1.98 లక్షలున్నారు. కమ్మవర్గం వారు 1.32 లక్షలు కాగా.. ఎస్సీ, ఎస్టీలవారు 3 లక్షలదాకా, బిసిలు 5లక్షల వరకు ఉంటారు. ముగ్గురూ రెడ్డి వర్గం అభ్యర్థులే అయినా పంట కాపు, పాకనాటి పేరిట కొత్త వివాదానికి తెర తీశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బిసి ఓటర్లే కీలకం కానున్నారు.
సుబ్బిరామి రెడ్డి తరఫున కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేంద్రమంత్రి పురంధేశ్వరి తదితరులు ప్రచార చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్ రెడ్డి విజయం కోసం ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడుసార్లు సుడిగాలి ప్రచారం చేశారు. గెలుపు గుర్రంగా బరిలోదిగిన మేకపాటి ప్రచారానికి అనుకున్నంత స్పందన రావడం లేదని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఒకరోజు ప్రచారం చేశారు. బరిలో ప్రధానంగా ముగ్గురే ఉన్నా మొత్తం 13 మంది పోటీ పడుతున్నారు. సిపిఎం చండ్ర రాజగోపాల్‌ను అభ్యర్థిగా నిలిపగా, మిగతవారంతా స్వతంత్రులు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో ప్రచార వ్యూహాలను పార్టీలు అమలు చేస్తున్నాయి. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వచ్చానని సుబ్బిరామి రెడ్డి ప్రచారం చేసుకుంటుండగా, కాంగ్రెస్ పాలన వైఫల్యాలతోపాటు జగన్ అవినీతిపైనా వంటేరు దృష్టి సారించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై నున్న సానుభూతి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తదితరాలు తనను గెలిపిస్తాయని మేకపాటి రాజమోహన్ రెడ్డి ధీమాతో ఉన్నారు. టి.సుబ్బిరామి రెడ్డి రాజకీయ నేతలతో పాటు సినిమా రంగంలో తనకు ఉన్న పరిచయాల కారణంగా వాణిశ్రీ వంటి వారిచే కూడా ప్రచారం చేయించారు. ఇటీవల నెల్లూరులో టిఎస్సార్ కళా పరిషత్‌ను ప్రారంభించి మోహన్ బాబుకు నటవాచస్పతి బిరుదును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నాగేశ్వర రావు వంటి హేమాహేమీలు వచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయ ఉద్దేశ్యంతోనే నిర్వహించారనే ప్రచారం జోరుగా జరిగింది.












Click it and Unblock the Notifications