తృతీయ కూటమి సాధ్యపడదా?

యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షం శిరోమణి అకాలీదళ్ తప్ప మరే పార్టీ కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు విఫలమైనప్పటికీ భాగస్వామ్య పక్షాలు తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేవనే మాట వినిపిస్తోంది. 24 మంది సభ్యులున్న వామపక్షాలు కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచనలో లేవు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తిరిగి బలం నిరూపించుకోవడానికి అవి ప్రాధాన్యం ఇస్తున్నాయి. బిజెపి కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు.
అయితే, కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం అప్రమత్తంగానే వ్యవహరించదలుచుకున్నట్లు అర్థమవుతోంది. సోమవారం రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష సభ్యులతో ముచ్చట పెడుతూ కనిపించారు. పార్లమెంటు హౌస్‌లో చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బిజెపి నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీని, ఇతర ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలపై ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు పోతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ చెప్పారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలకు ఆయన డిన్నర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెసు, బిజెపియేతర తృతీయ కూటమి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చను తాము ఆహ్వానిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ పరిస్థితులను చక్కదిద్డడంపైనే దృష్టి పెడతామని అన్నారు. భావసారూప్యం గల పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా తమ ఆలోచన సాగుతుందని బిజూ జనతాదళ్ నాయకుడు బి. మహతాబ్ చెప్పారు. గతంలో బిజూ జనతాదళ్ నేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయత్నాలు చేశారు. తాము మూడో కూటమికో, నాలుగో కూటమికో ఆలోచన చేయడం లేదని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని మహతాబ్ చెప్పారు. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి రాష్టానికి చెందిన నాయకులకు గుర్తింపు ఉండేలా ఇది ఉంటుందని అన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు మూడో కూటమి పురుడు పోసుకోకపోయినా 2014 ఎన్నికలకు ముందో, తర్వాతనో ప్రయత్నాలు చురుగ్గా సాగవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications