Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ జగన్ వైపు చూస్తున్నారా?: 2014 లక్ష్యం

YS Jagan
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వలసలు ప్రారంభమయ్యాయా అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల తర్వాత రెండు రోజుల పాటు ప్రశాంతంగా కనిపించిన రాజకీయ వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా వేడెక్కింది. ఉప ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమ వైపు భారీగా వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే మొదట రాజకీయ వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో అవన్నీ వట్టి మాటలే కావొచ్చునని కొట్టి పారేశారు.

అయితే మూడు రోజులుగా రాజకీయ వాతావరణం మాత్రం మరోసారి వేడెక్కింది. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం నుండి వరుసగా నేతలు కలుస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి దాదాపు ముప్పయ్యేళ్లుగా నమ్మకమైన మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కలవడం మంగళవారం జగన్‌ను కలిశారు.

కలవడం విషయం పక్కన పెడితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 2014 వరకు కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగుతుందని చెబుతూనే... ఈ మధ్యలో ఏమైనా అయితే తమను బాధ్యులను చేయవద్దన్నారు. అంటే ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కానీ, తెరాసతో కలిసి వైయస్సార్ కాంగ్రెసు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఎంఐఎం ఈసారి మద్దతిచ్చేది అనుమానమే అని అంటున్నారు.

ఆరు నెలల క్రితం టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు ఎంఐఎం కాంగ్రెసుకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఆ పార్టీ శాసససభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ అక్బరుద్దీన్ విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు జగన్‌ను అసదుద్దీన్ కలవడం వారి వైపు వెళ్లే అస్కారం ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఇక బుధవారం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని నిత్యం టార్గెట్ చేసిన స్వర్గీయ పి.జనార్ధన్ రెడ్డి తనయ విజయా రెడ్డి కూడా జగన్‌ను కలిశారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి మృతి అనంతరం వైయస్ తమను బాగా ప్రోత్సహించారని, తనను రాజకీయాలలోకి ఆహ్వానించారని, అయితే తాను సమయం చూసుకొని వస్తానని చెప్పానని వివరించారు. గత సాధారణ ఎన్నికలలో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో విజయా రెడ్డి 2014లో జగన్ పార్టీ తరఫున పోటీకి సంసిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటికిప్పుడు జగన్‌ను ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయి నేతలు కలవక పోయినప్పటికీ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్రమంగా వారు కూడా జగన్ పంచన చేరే అవకాశముందని అంటున్నారు. జగన్‌ను కలిసిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ పార్టీలోకి టిడిపి, కాంగ్రెసుల నుండి వలసలు త్వరలో ప్రారంభమవుతాయని మరోసారి చెప్పారు.

ఇప్పటికే జగన్ పార్టీతో నిత్యం తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో జగన్ వైపు మొగ్గి ఆ తర్వాత వివిధ కారణాల రీత్యా కాంగ్రెసులోనే ఉండిపోయిన పలువురు ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల ఫలితాలు జగన్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో వారు మళ్లీ పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, నీరజా రెడ్డి, ఖమ్మం జిల్లాలో కుంజా సత్యవతి ఇలా తదితరులు గతంలో జగన్ వైపుకు వెళ్లి ఆ తర్వాత యు-టర్న్ తీసుకున్నారు. జగన్ పార్టీ ఘన విజయంతో పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ జగన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు తదితర జిల్లాలలో నేతలు వైయస్సార్ వైపు వెళ్లేందుకు గోడ మీది పిల్లుల్లా చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉండటం, మరో సంవత్సరంన్నర పదవులు ఉండటంతో జంప్ అవుదామనుకుంటున్న నేతలు ప్రస్తుతం మిన్నకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే మాత్రం పలు జిల్లాల నుండి చాలామంది నేతలు జగన్ పార్టీ వైపు ఖచ్చితంగా క్యూ కడతారనే ప్రచారం జరుగుతోంది. నేతలు అందరూ 2014 లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే వీరిని ఎలా అడ్డుకోవాలా అని ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నట్లుగా సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+