హామీ: ఓవైసీ బ్రదర్స్ మధ్య ఎమ్మెల్సీ చిచ్చు!?

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ పేరును ఖరారు చేసిన వెంటనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మజ్లిస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్‌లతోపాటు అభ్యర్ధి ప్రభాకర్ స్వయంగా అసదుద్దీన్ ఒవైసీని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దానికి ఆయన అంగీకరించారట. అయితే, పార్టీలో చర్చించిన తర్వాత అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.
దీనిపై ఆదివారం మజ్లిస్ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. గ్రేటర్ మేయర్‌గా మజ్లిస్‌కు చెందిన మాజిద్ హుస్సేన్ కొనసాగుతున్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం మంచిదని అసద్ అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనిపై అక్బర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ తిరిగి అదే పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడమేమిటని అక్బర్ వాదించారట.
అధికార పార్టీ కారణంగా తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, టిడిపి మద్దతు తీసుకొని సొంతగా అభ్యర్థిని నిలబెడదామని అక్బర్ సోదరుడికి సూచించారట. అవసరమైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారట. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాల కారణంగా తొందరపడకూడదని, మజ్లిస్ పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలకడమే మంచిదని అక్బర్‌కు అన్న అసద్ సర్ది చెప్పారట.
కాంగ్రెసుతో విభేదాల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అభ్యర్థికి టిడిపి మద్దతిస్తుందని అందరూ భావించారు. అభ్యర్థిని నిలబెట్టడంపై టిడిపి, మజ్లిస్ మధ్య చర్చ కూడా సాగినట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెస్ ప్రభాకర్‌ను రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో మజ్లిస్-తెలుగుదేశం పార్టీల మధ్య చర్చలకు తెరపడింది. గతంలో మజ్లిస్ అభ్యర్థిగా సయ్యద్ అమీనుల్ హస్సన్ జాఫ్రీ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ప్రభాకర్‌కు భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని అసద్ హామీ ఇచ్చారట.
ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారం చెడినప్పటికీ జిహెచ్ఎంసి మేయర్ స్థానంలో మాత్రం పరస్పర ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మజ్లిస్ నేత కొనసాగుతున్నారు. జిహెచ్ఎంసిలో కాంగ్రెస్, మజ్లిస్‌లకు ఉన్న బలం దృష్ట్యా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే అవకాశముంది. గతంలో మజ్లిస్ తరఫున సయ్యద్ జాఫ్రీ ఎంపిక అయినందున ఇప్పుడు ప్రభాకర్‌కు మద్దతు పలకడమే సమంజసమని అసద్ భావించి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications