తెలంగాణపై బిజెపి, తెరాస ఫైట్: అసలుకే ఎసరు?

మరోవైపు, బిజెపిని ఎదుర్కునేందుకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. తెలంగాణవాదాన్ని సొంతం చేసుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుంటే, దాన్ని కాపాడుకుని మరింత బలాన్ని సంతరించుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి ఈ రెండు పార్టీలు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణవాదంపై ఇతర పార్టీల నుంచి బయటకు వచ్చే నాయకులకు ఇప్పుడు కేవలం తెరాస మాత్రమే కాకుండా బిజెపి కూడా కనిపిస్తోంది.
మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, పుష్పలీల వంటి నాయకులు బిజెపిలో చేరారు. తద్వారా తెలంగాణలో బిజెపి సత్తా చాటేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణవాదంపై ఈ రెండు పార్టీలు బరిలోకి దిగితే అసలుకే మోసం వస్తుందా ఆందోళన తెలంగాణవాదుల్లో క్రమంగా పెరుగుతోంది. మహబూబ్‌నగర్ శానససభ ఉప ఎన్నికలో తెరాసను ఓడించి బిజెపి విజయం సాధించింది. పరకాల శానససభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది. కానీ, తెలంగాణవాదంపై ఓట్లు రెండు పార్టీల మధ్య చీలిపోతే ఇతర పార్టీలు సొమ్ము చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
తెలంగాణలో సత్తా చాటడానికి వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కూడా సిద్ధపడుతున్నాయి. ఆ పార్టీల లక్ష్యం ప్రస్తుతానికి తెరాసనే. ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను బలహీనపరిస్తే తమకు దారి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీలున్నాయి. తెలుగుదేశం పార్టీ కెసిఆర్‌నే లక్ష్యంగా చేసుకుని పోరాటం చేస్తోంది. దీంతో తెరాసను బలహీనపరిచి తాను బలపేతం అయ్యే బిజెపి ప్రయత్నాలు ఈ మూడు పార్టీలకు కూడా ఊపిరి పోస్తున్నాయని అంటున్నారు.
బిజెపి, తెరాసలు వచ్చే ఎన్నికల్లో సమఉజ్జీలుగా పోటీ పడితే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రయోజనం పొందే అవకాశాలున్నాయని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. బిజెపి, తెరాస కలిసి పనిచేస్తే వాటి బలాన్ని ఆ నియోజకవర్గాల్లో కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. విడివిడిగా పోటీ చేస్తే తెలంగాణవాదం ఓట్లు చీలిపోయి అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications