విభజన: 25ఏళ్ల శ్రమ వృధా అవుతుందన్న సిఎం

విభజనతో మావోలు తిరిగి విజృంభిస్తే, పాత పరిస్థితులు పునరావృతం అవుతాయని కిరణ్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగైదు సరిహద్దుల్లో ఇప్పటికి యుద్ధ వాతావరణం ఉంటోందని, ఒకప్పుడు నక్సలిజానికి కంచుకోటల్లాంటి ప్రాంతాలున్న ఆంధ్రప్రదేశ్‌లో వారిని నియంత్రించడానికి రాష్ట్రం అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుందని, పాతికేళ్ల సమయం పట్టిందని ప్రస్తావించారట.
విభజన జరిగితే పాత పరిస్థితులు వస్తాయని, మావోయిస్టు ఉద్యమంలో జాతీయ స్థాయి నుంచి జోనల్ కమిటీల వరకు కీలకమైన నాయకత్వ శ్రేణిలో అత్యధుకులు ఎపికి చెందిన వారేనని, ప్రత్యేకించి తెలంగాణకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారట. రాష్ట్రంలో గత నలభై ఏళ్లకు పైగా జరిగిన మావోల హింసాత్మక సంఘటనలు ఆయన అధిష్టానం ముందు లెక్కలతో సహా వివరించారట.
ఒకప్పుడు యాభై నియోజకవర్గాల పరిధిలో మావోల ప్రభావం ఉండేదని, రాజకీయ నాయకులు రక్షణ కోసం జిల్లా కేంద్రాలకు, రాజధానికి వచ్చే వారని, మావోల దాడిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు మృతి చెందారని, అలాంటి నక్సలిజాన్ని నియంత్రించేందుకు ఇరవై అయిదేళ్లు పట్టిందని, విభజన జరిగితే మళ్లీ మావోయిస్టులు బలవంతులవుతారని, ఇన్నేళ్ల శ్రమ వృధా అవుతుందని చెప్పారట.












Click it and Unblock the Notifications