కాంగ్రెసు వ్యూహం: బాబు, కెసిఆర్‌లపై బద్నాం

కెసిఆర్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై కాకుండా ఆయన ప్రవర్తన, భాషలపై సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు విరుచుకుపడుతున్నారు. ఆయనను అబద్ధాలకోరుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్‌ను తెలంగాణ ద్రోహిగా వారు అభివర్ణిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వంటి తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా కెసిఆర్ తీరుపై ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ పాత్ర ఏమీ లేదనే విషయాన్ని చెప్పడానికి, ఆ రకమైన అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించేలా వారు వ్యవహరిస్తున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తప్పిదం వల్లనే జరిగిందని సీమాంధ్రలో ప్రచారం చేసుకోవడానికి అనువైన వాదనను కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు రూపొందించుకున్నారు. తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అలాగే, చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే విభజనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, మెజారిటీ అభిప్రాయం తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లయిందని ఇటీవల లగడపాటి రాజగోపాల్ అన్నారు.
ఇప్పటి పరిస్థితి అయితే, కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, పరిస్థితి ఎటు దారి తీసి, ఏ మలుపు తీసుకుంటుందో చెప్పడం కష్టమే. కానీ, సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు చాలా మంది సమైక్యవాదానికి అనుకూలంగా తమ వాదనను వినిపిస్తూనే, చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications