కెసిఆర్ మౌనం: తెరాస వర్గాల్లో అయోమయం
హైదరాబాద్: పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారా, లేదా అనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తేల్చకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్గాల్లో అయోమయం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికలలో తెరాస పక్షాన లోక్‌సభ, శాసనసభకు పోటీ చేయాలని ఆశిస్తున్న పార్టీ నేతలు అయోమయ స్థితిలో పడిపోయారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కెసిఆర్ గతంలో చాలాసార్లు చెప్పారు. అయితే, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతనే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ తాజాగా చెప్పారు. దీంతో పాటు తెరాస కాంగ్రెస్‌లో విలీనం కాదనీ, కేవలం వచ్చే ఎన్నికలలో పొత్తు మాత్రమే ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది.

పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినా చేయకున్నా, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నా తమ సీట్లకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందనే భయాందోళనలు పార్టీ నేతల్లో చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్లు దక్కని పరిస్థితి చాలా మంది నాయకులకు ఏర్పడింది. పార్టీలో కీలక పద వులు ఇవ్వకపోయినా, నియోజకవర్గ ప్రజలను నమ్ము కుని వారికి చేదోడు, వాదోడుగా ఉంటూ పార్టీ అధినేత కెసిఆర్ ఇచ్చిన కార్యక్రమాలన్నింటిని విజయవంతం చేశామని చెబుకుంటున్న నేతలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
ఈ స్థితిలో ఎందుకైనా మంచిదని కొందరు పార్టీ నాయకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెసు నాయకులతో సంబంధాలు నెరుపుతున్నారు. ఇప్పటికే విజయరామారావు, ఎ. చంద్రశేఖర్ వంటి నాయకులు కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేసినా, కాంగ్రెసు ఎన్నికల పొత్తు పెట్టుకున్నా కెసిఆర్ ఎవరెవరికి టికెట్లు వచ్చేలా చూస్తారనేది కూడా ఆందోళన కలిగించే విషయంగానే మారింది.












Click it and Unblock the Notifications