ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆళ్ళగడ్డ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
వర్గ రాజకీయాలు..వారసత్వంగా వస్తున్న రాజకీయ అగాధాల తో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికలు ప్రతీ సారి ఉత్కం ఠను రేపుతాయి. ఈ నియోజకవర్గంలో తొలి నుండి గంగుల - ఎస్వీ - భూమా కుటుంబాలదే రాజకీయ అధిపత్య పోరు సాగుతోంది. ఇక్కడ నుండి ఎస్వీ సుబ్బారెడ్డి అయిదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నాడు తండ్రి సుబ్బారెడ్డి.. కుమార్తె శోభా నాగిరెడ్డి ఒకే సారి సభలో సభ్యులుగా వ్యవహరించారు. 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అభ్యర్ధి మరణించినా..శోభాకే ఓటు వేసి ప్రజలు గెలిపించారు. శోభా మరణం తరువాత కుమార్తె అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డి తో కలిసి ఒకే సారి సభలో ఉండి మరో రికార్డు సాధించారు. భార్య - భర్తలైన శోభా నాగిరెడ్డి ఎన్నికల ముందు మరణిస్తే.. నాగిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉండి మరణించారు.
1962 నుండి ఆళ్లగడ్డలో..
కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డది రాజకీయంగా ప్రత్యేక స్ధానం. ఇక్కడ ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. వాటి లో ఆరు సార్లు టిడిపి, నాలుగు సార్లు కాంగ్రెస్, ప్రజారాజ్యం ఒకసారి, వైసిపి మూడు సార్లు , స్వతంత్రులు మూడు సార్లు గెలుపొందారు. శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుమార్తె శోభా నాగిరెడ్డి రెండు సార్లు టిడిపి, ఒక సారి ప్రజారాజ్యం, ఒకసారి వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి రెండు సార్లు టిడిపి నుండి గెలుపొందారు. 2009 లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన శోభా నాగిరెడ్డి ఇక్కడి నుండి గెలిచి ఆ తరువాత వైయస్ మరణంతో జగన్ కు మద్దతుగా వైసిపి లో చేరారు. 2012 లో జరిగిన ఉప ఎన్నికలో వైసిపి అభ్యర్ధిగా గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో పోలింగ్ కు ముందు శోభా నాగిరెడ్డి మరణించారు. అప్పటికే బ్యాలెట్ లో పేరు ఖరారు కావటంతో..మరణించిన తరువాత కూడా గెలిచిన నేతగా శోభా నాగిరెడ్డి చరిత్రలోకెక్కారు.

2014 లో వైసిపి గెలుపు..మారిన పరిస్థితులు..
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో2014 లో మొత్తంగా ఓట్లు 221178 కాగా, అందులో 172282 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసిపి నుండి పోటీ చేసిన శోభా నాగిరెడ్డికి 92108 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ధి గంగుల ప్రభాకర రెడ్డికి 74180 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి శోభా నాగిరెడ్డి 17928 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితం వచ్చే సరికే శోభా మరణించటం తో తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా కుమార్తె అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత అఖిల ప్రియ తన తండ్రితో కలిసి వైసిపి నుండి టిడిపిలోకి చేరారు. తరువాతి కాలంలో మంత్రి పదవి వరించింది. ఇక, 2014 ఎన్నిక ల్లో టిడిపి నుండి పోటీ చేసిన గంగుల ప్రభాకర రెడ్డి వైసిపి లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. గంగుల సోదరుడు ప్రతాప రెడ్డి కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరారు.












Click it and Unblock the Notifications