తెలంగాణ సిఎం రేసులో దామోదర ముందంజ
హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ పది జిల్లాల తెలంగాణకు పచ్చజెండా ఊపడంతో తెలంగాణ ప్రాంత సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారంటున్నారు.
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పలువురు సిఎం రేసులో ఉన్నారు. తెలంగాణ బిల్లును రాష్టప్రతి త్వరలోనే విధానసభకు పంపనున్నందున, బిల్లుకు ఆమోదముద్ర లభించి రాష్ట్రం ఏర్పాటుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయంటూ తెలంగాణ జైపాల్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తేలిపోవటంతో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవటానికి వివిధ వర్గాలకు చెందిన నాయకులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేసులో ముందున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ శనివారం ఢిల్లీకి చేరుకుని కేంద్ర నాయకులను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన దామోదర దళితుడు. వివాదాలకు దూరంగా ఉండటం, అవినీతి ఆరోపణలు లేకపోవటం ఆయనకు అదనపు అర్హతలుగా ఉన్నాయి.
కేంద్ర నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ అర్హతలతో సిఎం రేసులో ముందున్న దామోదర, ఆది, సోమవారాల్లో కేంద్ర నేతలతో సమావేశం అవుతారు. ముఖ్యమంత్రి పదవిని వివిధ సామాజిక వర్గాలవారు ఆశిస్తున్నా, అత్యధిక జనాభా ఉన్న వెనుకబడిన తరగతుల వారికే కట్టబెట్టే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications