ఇంట్లో ఎలుకల బెడద: ఈ నేచురల్ చిట్కాలతో ఎలుకలను తరిమికొట్టండి!!
చాలామంది ఇళ్లల్లో ఎలుకల బెడద వేధిస్తూ ఉంటుంది. ఎలుకలు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లో ఇంట్లో ఉన్న బట్టలు, వైర్లు తదితరాలను కొరికి నాశనం చేస్తూ ఆ ఇంట్లోని వారికి పెద్ద తలనొప్పిగా తయారవుతాయి. అంతేకాదు ఎలుకల వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
సహజంగా ఇంట్లోకి ఎలుకలు వస్తున్నాయి అంటే అర్థం.. మనం ఇంటిని శుభ్రంగా, సర్దుకుని మెయింటెన్ చేయడం లేదు అని. అందుకే ఎలుకల బెడద నుండి బయట పడాలి అంటే కొన్ని సహజమైన చిట్కాలతో పాటుగా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి షెల్ఫ్ నీటుగా సర్ది పెట్టుకోవడం అవసరం. ఎలుకల బెడద నుండి ఇంటిని కాపాడుకోవడానికి సహజసిద్ధమైన కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎలుకలకు ఉల్లిపాయల వాసన అంటే అస్సలు పడదు. ఈ వాసనకు ఎలుకలు చిరాకు పడి పోతూ ఉంటాయి. కాబట్టి ఎలుకలు తిరిగే చోట ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచండి. ఇంట్లోకి ఎలుకలు వస్తున్న మార్గాలలో కట్ చేసిన ఉల్లిపాయలను పెట్టండి. రెండు రోజులకు ఒకసారి వీటిని మారుస్తూ ఉంటే ఎలుకలు ఆ దరిదాపులకు కూడా రాకుండా పోతాయి.
ఇక ఎలుకలకు వెల్లుల్లి వాసన పరమ చిరాకు. సన్నగా తరిగిన వెల్లుల్లిని నీళ్ళల్లో కలిపి ఆ వెల్లుల్లి నీళ్లను ఇంటి చుట్టూ చల్లండి. ఇంట్లో ఎలుకలు తిరుగుతున్న ప్రదేశాలలో కూడా వెల్లుల్లి నీళ్లను చల్లాలి. ఇలా చేస్తే ఆ వాసనకు ఎలుకలు ఇంట్లోకి రావడం మానేస్తాయి. ఇక ఎలుకల బెడద నుండి బయట పడటం కోసం పుదీనా నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.
పుదీనా నూనె ను ఇంటి మూలల్లో అక్కడక్కడా చల్లడం వల్ల ఎలుకలు రాకుండా ఉంటాయి. దీని ఘాటైన వాసన కారణంగా ఎలుకలు ఇంట్లో నుండి బయటకు పోతాయి. అలాగే లవంగాల వాసనను కూడా ఎలుకలు అస్సలు ఇష్టపడవు . ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల వద్ద లవంగాలను ఉంచటం వల్ల, లేదా లవంగ నూనెను ఉంచడం వల్ల ఎలుకలు రాకుండా ఉంటాయి.
అంతేకాదు ఎలుకలు తిరిగే చోట బేకింగ్ సోడాను వేయడం వల్ల కూడా ఎలుకలు రాకుండా ఉంటాయి. పలుచటి వస్త్రంలో కారాన్ని వేసి మూటకట్టి ఆ కారం మూటను ఎలుకలు తిరిగే చోట పెడితే ఎలుకలు రాకుండా ఉంటాయి. మినుములు, నువ్వులను మెత్తని పొడిగా చేసి ఆ పొడిలో జిల్లేడు పాలను కలిపి ఉండలుగా చేసి ఎలుకలు తిరిగే చోట పెడితే వాటిని తిన్న ఎలుకలు చనిపోతాయి.
ఈ చిట్కాలతో మీ ఇంట్లో ఎలుకల పీడ విరగడ అవుతుంది. ఇక ఇంట్లోనే ఉండే పదార్థాలతో సహజసిద్ధమైన చిట్కాలను పాటించి ఎలుకలు బారి నుండి విముక్తి పొందండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా సర్దుకోండి. అప్పుడు ఎలుకలు రాకుండా, మీ ఇంటిని పాడు చెయ్యకుండా ఉంటాయి.












Click it and Unblock the Notifications