యువతలో అమోఘమైన క్రేజ్ ఉన్న సినీ హీరో మహేష్ బాబు కాంగ్రెస్ తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారా. అవుననే సమాధానమే వినిపిస్తోంది. కాంగ్రెస్ తో సినీ నటుడు, తన తండ్రి కృష్ణకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా మహేష్ ఎన్నికల ప్రచారం చేస్తారని అంటున్నారు. సొంత పార్టీ పెట్టడానికి చిరంజీవి, ఏదో ఒక పార్టీలో చేరడానికి రాజశేఖర్ సిద్ధమవుతున్న సమయంలో మహేష్ బాబు ఎన్నికల ప్రచారం వార్త గుప్పుమంటోంది. కృష్ణ ఒకసారి కాంగ్రెస్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఆయన సన్నిహితులు కూడా. ఇటీవల ప్రభుత్వం నిర్మించిన కొన్ని డాక్యుమెంటరీల్లో కృష్ణ నటించారు. అంతేకాకుండా కృష్ణకు మంత్రి గల్లా అరుణకుమారి బంధువు కూడా. కృష్ణ కూతురు అరుణకుమారి కోడలు. అంతేకాకుండా కృష్ణను వైయస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని అంటున్నారు. ఇటీవల కృష్ణకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ రావడం వెనక కూడా వైయస్ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా తండ్రీకొడుకులిద్దరూ కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసి పెడతారని అంటున్నారు. మహేష్ బాబు తెలుగు సినీ రంగంలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో. ఆయనకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈ ఫాలోయింగ్ ను వాడుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహమని అంటున్నారు.