మరో తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారి పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. పార్టీ కమిటీల్లో తనకు సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై ఆమె పార్టీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తన సన్నిహితుల వద్ద ఆమె తన అంతరంగాన్ని విప్పినట్లు సమాచారం. పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడని వారికి పార్టీ కమిటీల్లో స్థానం కల్పించి తనకు అన్యాయం చేశారని ఆమె విమర్శలు చేశారు. పార్టీకి ఏళ్ల తరబడి సేవలు చేశానని, తాను ఏమీ ఆశించలేదని, అయినా తనకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఇది నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగానే పరిణమించింది. నిజానికి, నన్నపనేని రాజకుమారి తెలుగు మహిళ అధ్యక్ష పదవిని ఆశించినట్లు సమాచారం. రోజా పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆ పదవికి తనను మించినవారు లేరని ఆమె అనుకున్నట్లు చెబుతారు. అయితే చంద్రబాబు ఆ పదవికి శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డిని ఎంపిక చేశారు. కానీ ఆమె ఆ పదవిని చేపట్టేందుకు సిద్ధంగా లేరు. దీంతో చంద్రబాబుకు రెండు విధాలా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యల వల్లనే నన్నపనేని రాజకుమారిని చంద్రబాబు దూరం చేసుకున్నట్లు భావిస్తున్నారు.