ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలుగుదేశం పార్టీ చంద్రగిరి శాసనసభా స్థానం అభ్యర్థి రోజా ప్రతిష్టను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారట. అందుకు చిరంజీవి ఒక సెల్ నే ఏర్పాటు చేశారట. చిరంజీవిపై రోజా ఆ ఆరోపణలు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వీడియో క్లిప్పింగ్ ను మార్ఫింగ్ చేసి నెట్ లో పెట్టారని, ఆ రకంగా తనపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని రోజా ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గోడు వెళ్లబోసుకున్నారు. చాలా కిరాతకంగా చిరంజీవి ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణితో కలిసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే చర్యలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శిస్తున్నారు. తన వీడియో క్లిప్పింగులను మార్ఫ్ చేయడానికి ఒక టెక్నికల్ సెల్ ను చిరంజీవి ఏర్పాటు చేశారని ఆమె అంటున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసేందుకు సాహసిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిరంజీవికి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కు తన కుటుంబంలోని స్త్రీల పట్లనే గౌరవభావం లేదని ఆమె ఆడిపోసుకుంటున్నారు. తన వీడియో క్లిప్పింగుల మార్ఫింగ్ విషయం రెండు రోజుల క్రితం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయమై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఆమె చెబుతున్నారు.