తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ టీచర్ గా మారారు. ఇటీవలి హైదరాబాదు పర్యటన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ పై చంద్రబాబు కారాలు మిరియాలు నూరిన విషయం తెలిసిందే. మేమైనా ప్రధానిని కిడ్నాప్ చేస్తామా, మేమైనా టెర్రరిస్టులమా, మాకెందుకు అపాయింట్ మెంటు ఇవ్వలేదంటూ ఆయన నిప్పులు చెరిగారు. పనిలో పనిగా తన మాటలకు మరింత పదును పెట్టడానికి ప్రధానిని శాడిస్టుగా అభివర్ణించారు. దానిపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తాను వాడిన పదాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు ఇంగ్లీష్ టీచర్ గా మారారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో డిక్షనరీ తీసి శాడిస్టు అనే పదానికి అర్థం చూపించారు. శాడిస్టు అనే పదం మన్మోహన్ సింగ్ సరిగ్గా అతుకుతుందని వివరించారు. ఎదుటివారు బాధపడుతుంటే చూసి సంతోషించేవ్యక్తిని శాడిస్టు అంటారని ఆయన చెప్పి, మైక్రోఫైనాన్స్ దారుణాలకు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాని ఆనందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై కూడా ఆయన ధ్వజమెత్తారు. రోశయ్యను విమర్సించడానికి మాటలు చాలడం లేదని ఆయన అన్నారు. ఏమైనా, చంద్రబాబు తన మాటలకు పదును పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇతర అర్థాలకు దారి తీస్తోంది.