తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నీ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చేతుల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయ వారసుడిగా లోకేష్ ను ముందుకు తెచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. స్టూడియోఎన్ నిర్వహణ అందులో ఓ భాగమని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు తర్వాత లోకేష్ చేపడతారని, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ లేదా మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి పార్టీ వచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షకు ప్లాన్ చేసింది కూడా లోకేషేనని చెబుతున్నారు. చంద్రబాబు దీక్ష సందర్భంగా లోకేష్ కేవలం కుమారుడిగా కాకుండా, ఓ నాయకుడిలా తన పని నిర్వర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు దీక్షా శిబిరం వద్దనే ఎక్కువ కాలం ఆయన గడుపుతూ ఆయన కనిపించడం, పోలీసుల పెనుగులాటలో గాయపడడం లోకేష్ కు పెద్ద యెత్తున కాకపోయినా ఏదో మేరకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు.