కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్రుమంటున్నారు. ప్రజారాజ్యం పార్టీకి దక్కాల్సిన పాట వైయస్ జగన్ వాడుకుంటున్నారనేది వారి ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. హీరో పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాలోని పాటను వైయస్ జగన్ కు చెందిన సాక్షి చానెల్ వాడుకుంటోంది. అది కూడా వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు బ్యాక్ గ్రౌండ్ గా వాడడం వారికి తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. నమ్మకమీయరా స్వామీ, అభయమీయరా స్వామి అనే పాటను సాక్షి చానెల్ జగన్ ఓదార్పు యాత్రకు బ్యాక్ గ్రౌండ్ లో వాడుకుంటోంది. వైయస్ జగన్ ను ప్రజలు వేడుకుంటున్నట్లు, హామీ కోరుతున్నట్లు ఆ పాట అర్థమిస్తోంది. తమ అభిమాన నటుడి పాట అయితే గియితే ప్రజారాజ్యం పార్టీకి ఉపయోగపడాలి గానీ కాంగ్రెసు పార్టీకి చెందిన వైయస్ జగన్ కు ఉపయోగపడడమేమిటని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఆ పాట వాడుకోవడానికి సాక్షి చానెల్ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది.