కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సాక్షి చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, స్టూడియోఎన్ సిఇవో నారా లోకేష్ కు కలిసి వచ్చినట్లే ఉంది. సాక్షి వార్తాకథనాన్ని పూర్తిగా బిట్లు బిట్లుగా చూపిస్తూ తన శైలిలో కొత్త వంటకాన్ని స్టూడియోఎన్ తయారు చేసింది. కాంగ్రెసుకు వ్యతిరేకంగా స్టూడియోఎన్ కు అది బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. హస్తగతం శీర్షికన సాక్షి చానెల్ సోనియా గాంధీని ఎలా టార్గెట్ చేసిందని పూసగుచ్చినట్లు టీవీ స్టూడియో వివరిచింది. గతంలో టీవీ9 కూడా ఇదే పని చేసింది. సాక్షి కథనాన్ని ఆ రకంగా వాడుకుంది. స్టూడియోఎన్ మాత్రం వైయస్ జగన్ ను తీవ్రంగా విమర్శించింది. పరోక్షంగా సోనియా గాంధీని బలపరిచింది. జాతీయ స్థాయిలో కాంగ్రెసు ఎలా ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెసు బలహీనపడడం చంద్రబాబుకు కావాలి. అందుకే, వైయస్ జగన్ ను తప్పు పడుతూ స్టూడియోఎన్ వార్తాకథనం ప్రసారమైందని అంటున్నారు. అధిష్టానంతో వైయస్ జగన్ వైరం ఈ రకంగా చంద్రబాబుకు అనుకూలంగా పనికి వస్తోంది.