ఆమరణ నిరాహార దీక్షకు దిగకుండానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును అరెస్టు చేసిన సంఘటనపై రాష్ట్ర సచివాలయంలో గమ్మత్తయిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెసిఆర్ అరెస్టుతో రాష్ట్రం అట్టుడికిన విషయం తెలిసిందే. ఆ అరెస్టుపై ముఖ్యమంత్రి కె. రోశయ్య హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందిస్తున్నారట. ముందుగా అరెస్టు చేయవద్దని, కొద్ది రోజులు దీక్ష సాగనిద్దామని ముఖ్యమంత్రి అంటే, అందుకు విరుద్ధంగా ముందే అరెస్టు చేయడం ద్వారా అల్లర్లకు సబితా ఇంద్రారెడ్డి కారణమయ్యారని ఆయన అంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై స్వయంగా రోశయ్య సబితా ఇంద్రారెడ్డిని తప్పు పట్టినట్లు చెబుతున్నారు. అయితే, సబితా ఇంద్రారెడ్డి ఆ నిర్ణయం తీసుకోవడం వెనక కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ ను అరెస్టు చేస్తే అల్లర్లు చెలరేగుతాయని, పరిస్థితి అదుపు తప్పుతుందని, ఆ స్థితిలో పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చేస్తుందని, తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని వైయస్ జగన్ భావించి సబితా ఇంద్రారెడ్డిని అందుకు ప్రోత్సహించారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డితో చేవెళ్ల చెల్లెమ్మగా పిలిపించుకున్న సబితా ఇంద్రారెడ్డి వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారిలో ఒకరనే విషయం రహస్యమేమీ కాదు.