వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుంభకోణంలో ఉన్నవారి పేర్లన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవారివేనట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్. వారంతా తెలంగాణను అడ్డుకుంటున్నవారేనని ఆయన అన్నారు. అలాంటి పరపతితో తెలంగాణేతర నేతలు ఢిల్లీ పాలకులు తమ గుప్పిట్లో ఉంచుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నవారు ఆంధ్రవాళ్ల చేతుల్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు, వ్యాపారానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతోందని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లు కోసం జరుగుతున్న అన్నా హజారే పోరాటం కన్నా తెలంగాణ ఉద్యమమే బలీయమైందని ఆయన అన్నారు. హన్మకొండలో ఆదివారం డిటిఎఫ్ సభలో ఆయన మాట్లాడారు.