మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికే తన కుమారుడు లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యువనేతగా పేరు పొందిన జగన్ ఎడతెరిపి లేకుండా కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్నారు. ఓదార్పు యాత్రను నిర్వహించడంతో పాటు వరుసగా జగన్ మూడు దీక్షలు చేపట్టారు. తాజాగా పోలవరం పాదయాత్ర చేపడుతున్నారు. విరివిగా కార్యక్రమాలు చేపడుతూ జగన్ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. జగన్ దాటికి తట్టుకోవడం వయస్సు రీత్యా చంద్రబాబుకు చాలా కష్టంగా మారిందని అంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ పోటీని తట్టుకోవడానికి యువకుడైన తన కుమారుడే సరైన నాయకుడవుతాడని చంద్రబాబు భావిస్తున్నారట. దీంతో గతంలో కుమారుడి రాజకీయ ప్రవేశం పట్ల అనాసక్తి ప్రదర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ శాసనసభకు పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు యువత పూర్తిగా నిర్వీర్యమై పోయిన స్థితిలో యువతను ఆకర్షించడానికి లోకేష్ పనికి వస్తాడని ఆయన అంచనా వేస్తున్నారని చెబుతున్నారు.