మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం అనౌన్స్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనది కాదా అంటే అవుననే అంటున్నారు, కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తి. జగన్‌ది గానీ, ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా చెప్పుకుంటున్న శివకుమార్‌ది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని బాషా శనివారం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు చెందినదని ఆయన చెప్పారు. రెండు సంవత్సరాల క్రితమే తాను ఆ పేరుతో పార్టీకోసం ఎన్నికల కమిషన్ వద్ద దరఖాస్తు చేసినట్టుగా చెప్పారు. 2009 సెప్టెంబర్‌లో పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. 2010 జూలైలో శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పేరుతో దరఖాస్తు చేసుకుంటే అదే సంవత్సరం ఆయనకు ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తూ లేఖను పంపించిందన్నారు.
దీంతో ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మార్చి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తనదేనని చెప్పారు. బాషా గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదని గతంలోనే చెప్పారు. దీనిపై జగన్‌కుగానీ, శివకుమార్‌కుగానీ హక్కులు లేవన్నారు. దీనిపై కోర్టుకు వెళతానని కూడా ఆయన అప్పుడే చెప్పారు. కాగా శనివారం జగన్ పార్టీని ప్రకటించాక ఆయన మరోసారి తాను దీనిపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.