జర్నలిజంలోకి వచ్చేందుకు కిరణ్ రెడ్డి సై
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిజంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట! కిరణ్ పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సమైక్య వాదన వినిపించారు.
ఈ నేపథ్యంలో విలేకరులు రాష్ట్రం విడిపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఏమిటని, కొత్త పార్టీ పెడతారా అని ప్రశ్నించారు. దానికి కిరణ్ స్పందిస్తూ... తాను కాంగ్రెసు పార్టీకి విశ్వాసపాత్రుడినని, కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, అలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.

తనలాంటి వారికి కాంగ్రెసు పార్టీతో ఉండాలా, సమైక్యానికి కట్టుబడి ఉండాలా అనే ఇబ్బంది తలెత్తకూడదని, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. అదే సమయంలో రాజకీయాల్లో ఉండాలని ఏముందని, మీ వృత్తి(జర్నలిజం)లోకి కూడా ప్రవేశించవచ్చునని సరదాగా వ్యాఖ్యానించారు. సమైక్యమే తమ నినాదం అన్నారు.
క్రికెట్‌లో బౌలర్ బంతి వేశాక దానిని బట్టి బ్యాట్స్‌మన్ స్పందించాలని, బాల్ వేయకముందే ఫోరో, సిక్సో కొట్టాలనుకుంటే ఔట్ అయిపోతాడని, శాసనసభకు విభజన ముసాయిదా బిల్లు ఎప్పుడు వస్తుందో తనకు తెలియదని, అది వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు.
దీనిపై ఎన్ని రోజుల్లో చర్చించాలన్న విషయాన్ని రాష్ట్రపతి చెబుతారన్నారు. దాని ప్రకారమే వ్యూహాలు ఉంటాయని, దీనిపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చించాలన్నదే తన ఉద్దేశ్యమని, పార్టీపరంగా మాట్లాడాలా? లేక ప్రతి ఒక్క సభ్యునికీ అవకాశం ఇవ్వాలా? అనే అంశం శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications