పురంధేశ్వరి ట్విస్ట్: కన్నడనాట కాంగ్రెస్‌కి ఎన్టీఆర్

అయితే, కర్నాటక రాష్ట్రంలోను ఎన్టీఆర్ ఫోటోతో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటకలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎపికి చెందిన పలువురు నేతలు ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి చిక్‌బళ్లాపురం జిల్లాలోని చిక్కబళ్లాపురం, గుడిబండ, గౌరిబిదనూరుల్లో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆమె తన తండ్రి ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకున్నారు.
టిడిపితో విభేదించి కాంగ్రెసులో చేరిన పురంధేశ్వరి విశాఖపట్నంలో తన పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకున్నారు. కాంగ్రెసును ఢీకొట్టేందుకే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినా... అదే పార్టీలో ఉన్న పురంధేశ్వరి తన ప్రచారంలో తన తండ్రి ఫోటోను పెట్టుకున్నారు. కూతురు కాబట్టి ఎవరు మాట్లాడలేదు. అయితే, తాజాగా కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న ఆమె అక్కడ తండ్రి ఫోటో పెట్టుకోవడం మాత్రం చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ కాంగ్రెసును ఎంతగా వ్యతిరేకించేవారో కర్నాటక ప్రజలకు, ప్రధానంగా తెలుగు వారికి తెలుసు. అలాంటి కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తున్న పురంధేశ్వరి తన తండ్రి ఫోటోను పక్క రాష్ట్ర ప్రచారంలో ఉపయోగించుకోవడం చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్‌ను అప్పుడు వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications