ఎన్నాళ్లని కాదు: ఎవరా మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి!

రెండు రోజుల క్రితం మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు నెలల్లో కన్నా అధినేత్రితో భేటీ కావడం ఇది మూడోసారి. దీంతో ఆంధ్రప్రదేశ్ అంటే కొత్తగా ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రానికి కన్నాను ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
అంతకుముందు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేరు వినిపించింది. ముఖ్యమంత్రి సీటును ఇస్తానంటే ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయం కోసం వెతికిన కాంగ్రెసు పార్టీకి కన్నా దొరికారని అంటున్నారు. గతంలో మంత్రి రఘువీరా రెడ్డి పేరు కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు కన్నాకు ఢిల్లీ నుండి పిలుపు రావడం, అధినేత్రితో భేటీ కావడం కాంగ్రెసు పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విభజనకు పలువురు సీమాంధ్ర నేతలు మానసికంగా సిద్ధమైపోయారు. జెసి దివాకర్ రెడ్డి వంటి నేతలు కేంద్రం తీరు చూస్తుంటే విభజన ఆగేలా కనిపించడం లేదంటున్నారు. దీంతో సిఎల్పీలో సీమాంధ్ర నేతలు కలిస్తే కొత్త ముఖ్యమంత్రిపై చర్చించుకుంటున్నారట.
మంగళవారం పార్టీ నేతలు జేసి దివాకర్ రెడ్డి, గాదె వెంకట రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు సిఎల్పీలో ఉన్నప్పుడు ఇదే విషయం చర్చకు వచ్చింది. ఎన్నికల వరకు మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేరని, పేరు చెడగొట్టుకోవడం తప్ప ఉపయోగం లేదని అందుకే ఎవరు ధైర్యం చేయక పోవచ్చునని కొందరు అభిప్రాయపడ్డారు.
పదవి ఎన్నాళ్లుంటుందనే దానికంటే ఆ పదవి రావడమే ముఖ్యమనుకునే వారు కూడా ఉంటారని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారట. డిసెంబర్‌లో బిల్లు, జనవరిలో విభజన జరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఎన్నికల ముందు మూడు నెలల ముఖ్యమంత్రి ఎవరు అని వారు చర్చించుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు కోట్ల నో చెప్పిన నేపథ్యంలో కన్నాను పిలవడం ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications