చంద్రబాబుకు మోడీ ఆఫర్!: ఏపీకి ప్రత్యేకం కాకుండా...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం పైన ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతుండటంతో, తమకూ ఆ హోదా కావాలని మరికొన్ని రాష్ట్రాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. బీహార్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వం పార్లమెంటులోనే హామీ ఇచ్చిందని, పేరు ఏదైనాదాని ద్వారా ఏపీకి లాభమే ముఖ్యమని, అవే ప్రయోజనాలను మీకు వేరే రూపంలో ఇస్తామని, ఈ ప్రతిపాదనకు సిద్ధమైతే ప్రతిపాదనలతో ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారని సమాచారం.

లేక్ వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర అధికారులతో జయంత్ సిన్హా శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీ విభజన టట్టంలో ఏపీకి కేంద్రం ఇస్తామన్న ఆర్థిక సాయం, ప్రస్తుత స్థితి గతుల పైన స్టేటస్ రిపోర్టును అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

పార్లమెటులో విభజన చట్టం ఆమోదం సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఏపీ సీఎస్ కృష్ణా రావు వివరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని, కేంద్రం నుండి ఇతోధికంగా ఆర్థిక సాయం చేస్తామని, ప్రత్యేక హోదా కల్పిస్తామని, రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామని ఇచ్చిన హామీలను వివరించారు.
హామీలు త్వరితగతిన నెరవేర్చేతే రాష్ట్ర అభివృద్ధికి వీలుంటుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే పారిశ్రామికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే వీలుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. అయితే, ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయాన్ని జయంత్ సిన్హా సూచనప్రాయంగా చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications