అన్నయ్యతో ఢీ: పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతాడా?
హైదరాబాద్: పార్టీ పెట్టే విషయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెనక్కి వెళ్లిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నెల రెండో వారంలో రాజకీయాల నుంచి మాట్లాడుతానంటూ ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ పెట్టే విషయంపై ఆయన సన్నిహిత మిత్రులతో, భావసారూప్యం గల వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారట. పార్టీ పేరును ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించడానికి ఓ బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. సోమవారం పార్టీ పేరు నమోదుకు దరఖాస్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తనతో ఎవరు కలిసి వచ్చినా లేకున్నా అనకాపల్లి నుంచి పోటీ చేయడం మాత్రం ఖాయమట.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం వల్ల ఆయన కేంద్ర మంత్రి అయిన తన అన్నయ్య చిరంజీవితో విభేదిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి చిరంజీవితో ఆయనకు సంబంధాలు అంత సజావుగా లేవని అంటున్నారు. నాగబాబు కుమారుడు వరణ్ తేజ సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిరంజీవితో పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడంతో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆయన అందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. సమైక్యాంధ్ర నినాదంతోనే ఆయన పార్టీని స్థాపించాలని అనుకుంటున్నట్లు, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టే యోచనను విరమించుకోవడంతో తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చినట్లు చెబుతున్నారు.
సీమాంధ్రలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి, కాంగ్రెసులో ఉన్న చిరంజీవిని ఢీకొనడానికి ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ అంటే పవన్ కళ్యాణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications