మోడీకి కూతురు జై: ఘాటుగా స్పందించిన సచిన్
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యులు సచిన్ టెండుల్కర్ కూతురు మద్దతు పలికినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సచిన్ స్పందించారు. సచిన్ సామాజిక వెబ్ సైట్లో స్పందిస్తూ.. తన తనయుడు అర్జున్, కూతురు సారాలకు సామాజిక వెబ్ సైట్లలో ఖాతాలే లేవని చెప్పారు.
సారా పైన వచ్చిన వార్తలు అసత్యాలని సచిన్ అన్నారు. తన పిల్లల్లో ఎవరికీ ట్విట్టర్ ఖాతాలు లేవని చెప్పారు. తన అభిమానులెవరూ ఇలాంటి నకిలీ ఖాతాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ తన కుటుంబ సభ్యుల పేరుతో ఎవరో చేస్తున్న పనులని, వాటిలో వాస్తవం లేదని తీవ్రంగా ఖండించారు.

కాగా, సచిన్ టెండూల్కర్‌ను కాంగ్రెసు పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయగా, కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయన కూతురు సారా మాత్రం నరేంద్ర మేడీ తరపున వకాల్తా తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
భవిష్యత్తులో తాను మోడీని భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు, ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా వచ్చింది. మోడీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారని, మోడీయే మన భావి ప్రధాని కాబోతున్నారని ఆమె అన్నారని, ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని వార్తలు వచ్చాయి.
కాగా, సోషల్ మీడియాలో సారా వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. సారా టెండూల్కర్ వ్యాఖ్యల కోసం ట్విట్టర్‌లో విస్తృతంగా గాలించారు. అయితే, ఆ పేరు మీద చాలా ట్విట్టర్ ఖాతాలున్నాయి. అయితే, సచిన్ ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ సారాకు అసలు ఖాతానే లేదని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications