గవర్నర్ గిరీ: మోత్కుపల్లికి బాబు బంపర్ ఆఫర్
హైదరాబాద్: రాజ్యసభ బెర్త్ దక్కక పోవడంతో అసంతృప్తిగా ఉన్న పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చారట! తెలంగాణ వెనుకబడిన వర్గాలకు చెందిన తనకు సీటు ఇవ్వాలని మొదటి నుండి మోత్కుపల్లి కోరుతున్నారు. దీనిపై బాబు కూడా హామీ ఇచ్చినప్పటికీ చివరకు సమీకరణాలు మారిపోయాయి. దీంతో మోత్కుపల్లి సహా పలువురు అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో మోత్కుపల్లికి బాబు మంచి ఆఫర్ ఇచ్చారట. మోత్కుపల్లి వంటి సీనియర్ నేతకు అన్యాయం జరగనివ్వబోమని, కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వస్తే గవర్నర్ పదవిని ఆయనకు ఇప్పిస్తామని చంద్రబాబు పార్టీ నేతల ద్వారా ఆయనకు చెప్పించారు. ఇంత పెద్ద ఆఫర్‌ను బాబు ఇంత వరకూ పార్టీలో ఏ నేతకూ ఇవ్వలేదు!

మోత్కుపల్లికి రాజ్యసభ సీటుపై తాను హామీ ఇచ్చానని కానీ, ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తాయని, అప్పటికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సర్దుబాటు చేయవచ్చని అనుకొన్నానని, అనుకోకుండా ముందే వచ్చేసరికి సర్దుబాటు కుదరలేదని, ఆయనకు ఏ రకమైన అన్యాయం జరగదని, దానికి తనదే బాధ్యత అని బాబు హామీ ఇచ్చారట.
ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి ప్రస్తావన వచ్చినప్పుడు.. మోత్కుపల్లి సిన్సియర్ నాయకుడని, సోదరుని మాదిరిగా ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని న్యాయం చేస్తామని బాబు చెప్పారు. మోత్కుపల్లి వంటి నేతను విస్మరించలేమని చెప్పినా ఆయన తగ్గలేదు. చివరకు ఎర్రబెల్లి, నామా నాగేశ్వర రావు కలిసి ఆయనను తమతో తీసుకువెళ్లారు. ఆ తర్వాత కూడా మోత్కుపల్లిలో ఆగ్రహం తగ్గలేదు.












Click it and Unblock the Notifications